Commonwealth Billiards : భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ (Pankaj Advani) అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ఈమధ్యే ఆసియా టీమ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలుపొందిన పంకజ్ కామన్వెల్త్ బిలియర్డ్స్ తొలి సీజన్లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మారిషియస్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన 6 – రెడ్ స్నూకర్ పోరులో గ్జావియర్ డ్రా(ఆస్ట్రేలియా)కు చెక్ పెట్టాడు. ఆరంభంలో వెనకబడినా ఆఖర్లో పుంజుకున్న అద్వానీ ప్రత్యర్ధిపై 3-1తో జయభేరి మోగించాడు. అయితే.. మరో ఆటగాడు బ్రిజేష్ దమానీ మాత్రం నిరాశపరిచాడు. సిప్రస్‌కు చెందిన మైఖేల్ జియర్జిస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
మహిళల విభాగంలో కీర్తనా పండియన్, ఆసియా ఛాంపియన్ అనుపమ రామచంద్రన్‌లు నాకౌట్ మ్యాచ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన సింఫీ డ్లామినిని 2-0తో కీర్తన మట్టికరిపించింది. తర్వాతి రౌండ్లో ఆమె మలేషియా క్రీడాకారిణితో తలపడనుంది. ఆసీస్ ప్లేయర్ లిల్లీ మెలడ్రమ్ను ఓడించిన అనుపమ క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.