Pandya talks about money | టీమిండియా యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన జీవితం గురించి మాట్లాడాడు. బరోడాలో చిన్న అపార్ట్మెంట్లో జీవించే అతని కుటుంబం ఇప్పుడు ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తన ప్రయాణం గురించి పాండ్యా పెదవి విప్పాడు. ముఖ్యంగా ఐపీఎల్లో భారీగా డబ్బు దొరుకుతుందని చెప్పిన పాండ్యా.. ఆ డబ్బు ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాడు.
తను, కృనాల్ పాండ్యా ఇద్దరూ క్రికెట్లో డబ్బు ఉందనే విషయాన్ని గుర్తించామని, అదే సమయంలో మైదానంలోనే తామిద్దరం ఉండేలా చూసుకున్నామని వెల్లడించాడు. జీవితంలో డబ్బు చాలా విషయాలను మార్చేస్తుందని, దానికి తాను కూడా ఒక ఉదాహరణ అని చెప్పాడు. ఆ డబ్బు లేకపోతే తాను ఏ పెట్రోల్ పంపులోనో పని చేస్తూ ఉండేవాడినన్నాడు.
తనకు కుటుంబం ముఖ్యమని, వారికి మంచి జీవితం అందేలా చూడటమే తన లక్ష్యమని తెలిపాడు. ‘‘2019లో ఒక వ్యక్తితో మాట్లాడా. మీ కుర్రాళ్లకు డబ్బు ఉండకూడదు అని అతను అన్నాడు. దానికి నేనొప్పుకోను. ఒక చిన్న పల్లెటూరు నుంచో లేదంటే టౌన్ నుంచో వచ్చిన వ్యక్తికి భారీ కాంట్రాక్టు దొరికితే ఆ డబ్బును అతనొక్కడే ఉంచుకోడు.
తల్లిదండ్రులు, బంధువులు వాళ్లందరికీ అండగా ఉంటాడు. డబ్బు కచ్చితంగా జీవితాన్ని మారుస్తుంది. అదే సమయంలో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది కూడా. డబ్బు గురించి మాట్లాడకూడదని చాలామంది అంటారు. నేను దాన్ని నమ్మను. ఎందుకంటే నీకు ఆట అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు డబ్బు కూడా ముఖ్యమే’’ అని పాండ్యా పేర్కొన్నాడు.