దుబాయ్: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 స్కోరుకు పరిమితమైంది. షమీమ్ హుస్సేన్(30) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఆఫ్రిదీ(3/17), రవూఫ్(3/33)..బంగ్లా పతనంలో కీలకమయ్యారు. తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 135/8 స్కోరు చేసింది. హరిస్(31), నవాజ్(25) రాణించారు. తస్కిన్ అహ్మద్(3/28) మూడు వికెట్లు తీయగా, మెహదీహసన్, రిశాద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా టైటిల్ పోరు జరుగనుంది.
పాక్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో బంగ్లాను మొదటి ఓవర్లోనే ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్(0)ను ఔట్ చేయడం ద్వారా ఆఫ్రిదీ దెబ్బతీశాడు.సైఫ్ హసన్ ఒకింత తడబడటంతో బంగ్లాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఆఫ్రిదీ తన మూడో ఓవర్లో తౌహిద్(5)ను ఔట్ చేయగా, సైఫ్(18)ను రవూఫ్ పెవిలియన్ పంపడంతో బంగ్లా కష్టాలు రెట్టింపయ్యాయి. వీరిని అనుసరిస్తూ మెహదీ (11), నురుల్ (16) వెంటనే వెంటనే ఔటయ్యారు. ఈ దశలో షమీమ్ హుస్సేన్(30) ఒంటరిపోరాటం చేశాడు. ఏడో వికెట్‌కు తంజిమ్‌తో కలిసి కీలకమైన 24 పరుగులు జోడించాడు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు అవసరమైన దశలో రిషాద్(16 నాటౌట్) ఫోర్, సిక్స్‌తో ఆశలు రేపినా లాభం లేకపోయింది.
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోరంగా తడబడింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తస్కిన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ ఫర్హాన్(4) మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. టోర్నీలో మంచి ఫామ్‌మీదున్న ఫర్హాన్..షాట్ ఆడే క్రమంలో పాయింట్లో ఉన్న రిషాద్ హుస్సేన్ చేతికి చిక్కాడు. దీంతో 4 పరుగులకే పాక్ వికెట్ల ఖాతా మొదలైంది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన ఆయూబ్(0) టోర్నీలో నాలుగోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో ఉన్న పాక్‌కు పరుగుల రాక కష్టమైంది. పవర్ ప్లే ముగిసే సరికి పాక్ రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులకు పరిమితమైంది. దెబ్బమీద దెబ్బ అన్నట్లు 7వ ఓవర్లో రిషాద్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్(13) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
ఫకర్‌ను అనుసరిస్తూ హుస్సేన్(3) కూడా పెవిలియన్ చేరడంతో పాక్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. పది ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు 46/4గా నమోదైంది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సల్మాన్(19)మరో మారు నిరాశపరిచాడు. కనీసం 100 పరుగులైనా చేరుకుంటుందా అన్న తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన ఆఫ్రిదీ(19) అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు. ఈక్రమంలో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఆఫ్రిదీ..చివరికి తస్కిన్ ఖాతాలో చేరాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న హరిస్‌కు నవాజ్ జత కలువడంతో పాక్‌కు కలిసొచ్చింది. ఈ ఇద్దరు బంగ్లా బౌలింగ్‌ను సమర్థంగా రాణించడంతో పాక్‌కు పోరాడే స్కోరు దక్కింది.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 135/8(హరిస్ 31, నవాజ్ 25, తస్కిన్ 3/28, రిషాద్ 2/18), బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 124/9(షమీమ్ 30, రిషాద్ 16 నాటౌట్, ఆఫ్రిదీ 3/17, రవూఫ్ 3/33)