కోల్‌కతా: వన్డే ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు నాకౌట్ బెర్త్‌లు దక్కించుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీలో ఉన్న పాకిస్థాన్ శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. మెగాటోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాక్ అమీతుమీ తేల్చుకోనుంది. భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ రేసులో నిలువనున్న నేపథ్యంలో బాబర్ సేనకు ఈ మ్యాచ్ చావో రేవోలా మారింది.
ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. న్యూజిలాండ్‌ను దాటుకొని నాకౌట్ బెర్త్ దక్కించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ (0.743) ఎంతో మెరుగ్గా ఉండగా.. పట్టు వదలొద్దని పాక్ (0.036) చూస్తున్నది. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ (2025) బెర్త్ దక్కాలంటే టాప్-7లో చోటు నిలుపుకోవడం తప్పనిసరి కావడంతో.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా పోరాడేందుకు సిద్ధమైంది.