T20 Tri Series | పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. త్వరలో జరుగనున్న ట్రై సిరీస్‌కు సైతం ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక, జింజాబ్వేలతో జరుగనున్న టీ20 ముక్కోణపు టీ20 సిరీస్ వేదికలతో పాటు షెడ్యూల్‌ను మార్చింది. మొదటి షెడ్యూల్ ప్రకారం ట్రై సిరీస్ నవంబర్ 17న మొదలుకావాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 18న ప్రారంభం కానున్నది.
మ్యాచులన్నీ రావల్పిండిలోనే జరుగుతాయి. ఫైనల్‌తో సహా ఐదు మ్యాచులకు లాహోర్ అతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఏడు మ్యాచులు రావల్పిండిలోనే జరుగుతాయని పీసీబీ ధ్రువీకరించింది. టోర్నీ ఫైనల్ నవంబర్ 29 జరుగుతుంది. భద్రతతో పాటు ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకొని శ్రీలంక, జింబాబ్వే క్రికెట్‌ను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య మిగిలిన రెండు వన్డేల తేదీల్లోనూ మార్పులు చేసింది. ఈ నెల 11న మ్యాచ్ జరగ్గా.. 13, 15 తేదీల్లో జరగాల్సిన మ్యాచులను 14, 16 తేదీల్లో రావల్పిండి వేదికగా జరుగుతాయి. ఇస్లామాబాద్‌లో ఇటీవల ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంక ప్లేయర్లు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయానికి వచ్చారు. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా, పాకిస్తాన్‌లోని శ్రీలంక హైకమిషనర్ తర్వాత ఆటగాళ్లతో మాట్లాడి భద్రత విషయంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్లో వన్డే, ట్రై సిరీస్‌లో సిరీస్ ఆడుతారని శ్రీలంక జట్టు మేనేజర్ మహింద హలంగోడ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా పాక్ క్రికెట్‌పై నమ్మకానికి ఇది సంకేతమని.. సిరీస్‌లో ఆడేందుకు అంగీకరించిన శ్రీలంక జట్టుకు పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రై సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచులు ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడుతాయి.
నవంబర్ 18 : పాకిస్తాన్ Vs జింబాబ్వే
నవంబర్ 20 : శ్రీలంక Vs జింబాబ్వే
నవంబర్ 22 : పాకిస్తాన్ Vs శ్రీలంక
నవంబర్ 23 : పాకిస్తాన్ Vs జింబాబ్వే
నవంబర్ 25 : శ్రీలంక Vs జింబాబ్వే
నవంబర్ 27 : పాకిస్తాన్ Vs శ్రీలంక
నవంబర్ 29 : ఫైనల్ మ్యాచ్