PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారు. పాకిస్తాన్ దాడుల్లో ముగ్గురు అమాయక క్రికెటర్లు సహా ఎనిమిది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ముక్కోణపు సిరీస్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. టీ20 ట్రై సిరీస్ నవంబర్ 17 నుంచి 29 వరకు లాహోర్‌లో షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పీసీబీ తెలిపింది. పాక్ దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినా.. సిరీస్‌ను రద్దు చేయడం లేదని పీసీబీ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని.. ప్రత్యామ్నాయంగా మరో జట్టుతో చర్చలు జరుపుతున్నామని.. చర్చల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. పాకిస్తాన్లో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు తమ జట్టును పంపబోమని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది.
పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన దేశీయ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఏసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ దాడిని ఆఫ్ఘన్ ప్లేయర్లు, పౌరులపై దాడిగా అభివర్ణించింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆడడం అసాధ్యమని స్పష్టం చేసింది. నేపాల్, యూఏఈ సహా పలు అసోసియేట్ దేశాలతో సంప్రదింపులు జరుపుతుందని పాక్ బోర్డు వర్గాలు తెలిపాయి. టెస్టులు ఆడే జట్టును ట్రై సిరీస్‌లోకి తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీ20 ట్రై సిరీస్ ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉంటుందని పీసీబీ భావిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ హోదా పొందే ముందు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు తరుచూ పాక్‌లో పర్యటించింది. అలాగే, ఆటగాళ్లు సైతం పాక్ దేశీయ లీగ్‌లో ఆడారు. ఇటీవల సంబంధాలు దెబ్బతినగా.. ఆసియా కప్‌కు ముందు రెండు దేశాలు షార్జాలో ట్రై-సిరీస్ ఆడాయి. ఇందులో యూఏఈ జట్టు పాల్గొంది. ఆ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా.. ఘర్షణలు జరగకుండా ఉండేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘన్ ప్రేక్షకులను వేర్వేరు స్టాండ్లలో కూర్చోబెట్టారు.