ఢిల్లీ : ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7 దాకా బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్).. బుధవారం రాత్రి ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్)కు తెలిపింది. దీంతో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు కల్గిన భారత్.. పాక్ స్థానంలో మరో జట్టును భర్తీ చేసేందుకు గాను బంగ్లాదేశ్‌ను ఆశ్రయించింది.
వాస్తవానికి ఈ టోర్నీలో పాల్గొనకుంటే భారత్ కంటే పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం ఉండనుంది. వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల హాకీ వరల్డ్ కప్‌నకు ఈ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌గా ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ నుంచి తప్పుకోవడం పాక్ ప్రపంచకప్ ఆశలపై నీళ్లు చల్లినట్టే అవుతుంది.