దుబాయ్ : అండర్-19 ఆసియాకప్‌లో యువ భారత్‌కు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో టీమ్ఙండియా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది. రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి టైటిల్‌ను ఒడిసిపట్టుకుందామనుకున్న యువ భారత్ ఆశలపై దాయాది పాక్ నీళ్లు గుమ్మరించింది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. అలీ రెజా (4/42), హుజైఫా అఫ్సాన్ (2/12), అబ్దుల్ సుభాన్ (2/29) ధాటికి భారత యువ బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. టోర్నీలో సూపర్‌ఫామ్ మీద ఉన్న వైభవ్ సూర్యవంశీ(26), ఆరోన్ జార్జ్(16), విహాన్ మల్హోత్ర(7), అభిజ్ఞాన్ కుందు(13) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.
పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పాక్ బౌలర్లు చెలరేగడంతో మన బ్యాటర్లు చేష్టలుడిగిపోయారు. అంతకుముందు సమీర్ మిన్హాస్(113 బంతుల్లో 172, 17ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 347/8 స్కోరు చేసింది. పసలేని భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ సమీర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఆసియాకప్‌లో పాక్ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సమీర్‌కు తోడు అహ్మద్ హుస్సేన్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీపేశ్ దేవేంద్రన్ (3/83), కిలాన్ పటేల్ (2/44) ఫర్వాలేదనించారు. సమీర్ మిన్హాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ దక్కింది.