Babar Azam: వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో తలెత్తిన సంక్షోభం ముదిరిపాకాన పడుతుందా..? తాజా పరిణామాలను చూస్తే అదే దిశగా సాగుతున్నాయి. సెలక్షన్ కమిటీని రద్దు చేయడం, విదేశీ కోచ్‌లను తొలగించడంతో పాటు బుధవారం రాత్రి ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే బాబర్ తప్పుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధినేత జకా అష్రఫ్ పై న్యాయం పోరాటానికి దిగనున్నాడని సమాచారం. కొద్దిరోజుల క్రితమే బాబర్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ ల మధ్య వాట్సాప్ చాట్ లీక్ అవడం వెనుక అష్రఫ్ హస్తమున్నదని ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
బాబర్ వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌లో ఉండగా ఈ టోర్నీలో పాక్ వరుసగా నాలుగుమ్యాచ్లు ఓడి సెమీస్ అవకాశాలు అడుగంటిన నేపథ్యంలో బాబర్.. అష్రఫ్తో మాట్లాడానికి ప్రయత్నిస్తే ఆయన అందుకు టైమ్ ఇవ్వలేదని, దీంతో పీసీబీ-బాబర్ మధ్య విభేదాలు తలెత్తాయిన వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జకా అష్రఫ్.. స్థానికంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ – నజీర్‌ల మధ్య చాట్‌ను బయటపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాబర్ ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ తనను బద్నాం చేసే విధంగా వ్యవహరించిన పీసీబీ చీఫ్ తీరుపై అతడు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలగజేస్తూ అష్రఫ్ చేసిన ఈ పనికి న్యాయపరంగానే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు ‘జియో స్పోర్ట్స్’ కథనం వెల్లడించింది.
కెప్టెన్లుగా అఫ్రిది, మసూద్..
బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో పాకిస్తాన్.. కొత్త సారథులను ప్రకటించింది. యువ పేసర్ షహీన్ షా అఫ్రిదిని టీ20లలో సారథిగా నియమించిన పీసీబీ.. టెస్టులలో మాత్రం షాన్ మసూద్‌ను ఎంపికచేసింది. సమీప భవిష్యత్‌లో పాకిస్తాన్‌కు వన్డేలు లేకోవడంతో ఆ ఫార్మాట్ సారథిని పీసీబీ ప్రకటించలేదు.