లాహోర్: భారత్ చేతిలో ఓటమి పాకిస్థాన్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తలపడినా ప్రతీసారి పాక్ టీమ్ ఓటమి ఎదుర్కొంటున్న వేళ ఆ దేశ అభిమానుల్లో అసహనం అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తుండగా, ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి బాధలు అనుభవించాలంటూ ఓ పాక్ అభిమాని ఐసీసీకి రాసిన అభ్యర్థన లేఖ వైరల్‌గా మారింది. ‘ఇప్పటి నుంచైనా భారత్, పాకిస్థాన్ జట్లను ఒక గ్రూపులో ఉంచకండి. ప్రతీసారి టీమ్ఇండియా చేతిలో ఓటమి తట్టుకోలేకపోతున్నాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంచితే మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు అయ్యే దవాఖాన ఖర్చుల కోసం పాక్ అభిమానులకు కేటాయించండి. ఇది వీలు కాకపోతే మ్యాచ్‌తో వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పాక్ ఫ్యాన్స్‌కు ఇవ్వండి’ అని రాసుకొచ్చాడు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతున్నది.