ఇస్లామాబాద్ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో.. పాకిస్థాన్‌తో తలపడేందుకు ఇండియా నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాకిస్థాన్ చాంపియన్స్ జట్టుతో ఇండియా సెమీస్‌లో ఆడాల్సి ఉంది. కానీ ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్న నేపథ్యంలో .. పాక్‌తో ఆడేది లేదని ఇండియా నిష్క్రమించింది. అయితే ప్రైవేటు లీగ్‌ల్లో ఆడే పాకిస్థాన్ జట్లకు తమ దేశం పేరు పెట్టకుండా ఉండేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెలికామ్ ఏసియా స్పోర్ట్స్ అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన కథనం వచ్చింది.
బ్రిటన్‌లో జరుగుతున్న డబ్ల్యూసీఎల్లో వివాదం చెలరేగడం వల్ల.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ నిర్ణయం తీసుకున్నది. ప్రైవేటు టోర్నీల్లో ఆడే పాకిస్థాన్ జట్లకు దేశం పేరు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పీసీబీ యోచిస్తున్నది. బోర్డు డైరెక్టర్లతో జరిగిన చర్చల్లో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించడం అంటే తమ దేశానికి చెడ్డ పేరు వస్తుందని పీసీబీ బోర్డు అభిప్రాయపడింది. భవిష్యత్తులో ప్రైవేటు లీగ్‌ల్లో ఆడే ఏ సంస్థకైనా దేశం పేరు పెట్టుకునే అనుమతి ఇవ్వబోమని పీసీబీ నిర్ణయించింది. అయితే ఈ ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో మాత్రం పాకిస్థాన్ లెజండ్స్ జట్టు యధావిధిగా పోటీపడనున్నది. జింబాబ్వే, కెన్యా, అమెరికా లాంటి దేశాల్లో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో అనేక సంస్థలు పాకిస్థాన్ పేరు వాడినట్లు రిపోర్టు ఉన్నది. ఒకవేళ ప్రైవేటు సంస్థలు దేశం పేరు వాడితే దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పీసీబీ వార్నింగ్ ఇచ్చింది.