వాఘా: బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. రెండు రోజుల పాటు పాకిస్థాన్లో పర్యటించారు. ఆ ఇద్దరూ ఇవాళ వాఘా బోర్డర్ ద్వారా దేశంలోకి ప్రవేశించారు. పాక్లో పర్యటించడం అద్భుతంగా ఉందని బిన్నీ తెలిపారు. అమృత్సర్లో బోర్డర్ దాటిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 1984లో పాక్లో టెస్టు మ్యాచ్ ఆడానని, అప్పుడు ఎలా తమకు ఆతిథ్యం లభించిందో, ఇప్పుడు కూడా అలాంటి ఆతిథ్యమే దక్కిందన్నారు. తమను రాజుల్లా చూసుకున్నారన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో పాటు ఇతర పాక్ అధికారుల్ని కూడా కలిసినట్లు రోజర్ బిన్నీ వెల్లడించారు. తమ పర్యటన పట్ల పాక్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేసిందన్నారు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. రెండు రోజులు పాక్లో పర్యటించామని, ఆ పర్యటన బాగా సాగిందన్నారు. గవర్నర్ తమకు విందును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాక్ క్రికెట్ బోర్డు ఆతిథ్య బాగుందన్నారు. రెండు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలను పునరుద్దరించాలని పాక్ క్రికెట్ బోర్డు కోరిందని, అయితే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని శుక్లా తెలిపారు. ప్రభుత్వం ఏం చెబితే తాము అదే చేస్తామని పాక్కు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తమ పర్యటన కేవలం క్రికెట్ కోసమే అని, దీంట్లో ఎటువంటి రాజకీయ ఎజెండా లేదన్నారు.