లాహోర్: పాకిస్తాన్ నేషనల్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం( Babar Azam )ను తరచూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోలుస్తుంటారు. అన్ని ఫార్మాట్లలోనూ విరాట్‌కు దీటుగా పరుగులు చేస్తున్నాడతడు. అయితే టీ20 క్రికెట్లో మాత్రం బాబర్ కాస్త ముందే ఉన్నాడు. విరాట్ కంటే కాదు.. యూనివర్స్ బాస్, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడు క్రిస్ గేల్‌ను కూడా వెనక్కి నెట్టి తాజాగా ఓ అరుదైన రికార్డును బాబర్ ఆజం సొంతం చేసుకున్నాడు. ఆదివారం నేషనల్ టీ20 కప్‌లో భాగంగా సదర్న్ పంజాబ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ పంజాబ్ తరఫున ఆడిన బాబర్.. ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 59 పరుగులు చేసిన అతడు.. టీ20ల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. టీ20ల్లో అతనికిది 187వ ఇన్నింగ్స్. ఇదే 7 వేల పరుగులు చేయడానికి గేల్ 192 ఇన్నింగ్స్ తీసుకుంటే.. అంతకంటే 5 ఇన్నింగ్స్ ముందుగానే బాబర్ ఈ మైల్స్టోన్ అందుకోవడం విశేషం. మరోవైపు విరాట్ కోహ్లి 212 ఇన్నింగ్స్‌లో 7 వేల రన్స్ చేశాడు. అతడు ఈ మధ్యే టీ20ల్లో పది వేల పరుగులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో 7 వేల మైల్స్టోన్ అందుకున్న 30వ బ్యాట్స్‌మన్‌గా బాబర్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 56 ఇన్నింగ్స్‌లో 2204 పరుగులు చేసి పదో స్థానంలో ఉన్నాడు.