న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు సమిష్టిగా రాణించి కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో కెనడాను ఓడించి సూపర్-8 ఆశలను సజీవంగా ఉంచుకుంది. మహ్మద్ అమిర్ (2/13), హరీస్ రవూఫ్ (2/26) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. 20 ఓవర్లలో 106/7 కే పరిమితమైంది. ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. స్వల్ప ఛేదనలో పాక్.. 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 53 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. అమిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
పటిష్టమైన పాకిస్థాన్ పేస్ బలానికి పసికూన కెనడా విలవిల్లాడింది. ఆ జట్టులో ఓపెనర్ ఆరోన్ ఒక్కడే రాణించాడు. ఎదుర్కున్న తొలి రెండు బంతులనే బౌండరీలుగా మలిచిన అతడు సహచర ఆటగాళ్లు వచ్చినోళ్లు వచ్చినట్టే క్రీజును వదులుతున్నా ఒంటరిగా పోరాడాడు. ఆరోన్ మినహా కెప్టెన్ సద్ బిన్ జఫర్ (10), కలీమ్ సనా (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
స్వల్ప ఛేదనలో పాకిస్థాన్ కూడా ధాటిగా ఆడలేకపోయింది. సారథి బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 33) ఓపెనర్ స్థానాన్ని యువ ఆటగాడు సయీమ్ అయూబ్ (6) కు త్యాగం చేసినా అతడు విఫలమయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన బాబర్‌తో కలిసి రిజ్వాన్ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించి పాక్ విజయాన్ని ఖాయం చేశాడు. బాబర్ నిష్క్రమించినా రిజ్వాన్ చివరిదాకా క్రీజులో నిలిచి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
కెనడా: 20 ఓవర్లలో 106/7 (ఆరోన్ 52, సనా 13, అమిర్ 2/13, రవూఫ్ 2/26).
పాకిస్థాన్: 17.3 ఓవర్లలో 107/3 (రిజ్వాన్ 53 నాటౌట్, బాబర్ 33, డిల్లాన్ 2/18, గోర్డన్ 1/17)