Umpire Injured : ఆసియా కప్‌లో హ్యాండ్షే (Hand Shake) వివాదాన్ని సాకుగా చూపించి టోర్నీని బహిష్కరిస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్ (Pakistan) చివరకు ఐసీసీకి తలొగ్గొంది. టోర్నీ నుంచి వైదొలిగితే 15శాతం ఆదాయం కోల్పోతామనే భయంతో యూఏఈ (UAE)తో మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్‌కూ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft) రిఫరీగా వ్యవహరించాడు. భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడంతో అతడిపై కోపంతో రగిలిపోయిన పాక్ ఆటగాళ్లు అంపైర్‌ను గాయపరిచారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
సూపర్ 4 బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో పాక్ జట్టు ఆతిథ్య యూఏఈతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ అఘా బృందం ప్రత్యర్థికి పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. యూఏఈ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ మొహమ్మద్ హ్యారిస్ (Mohammad Harsi) బంతిని బౌలర్ సయీం ఆయూబ్ వైపు విసిరాడు. అయితే.. అతడు క్యాచ్ అందుకునే లోపే బంతి నేరుగా అంపైర్ రుచిరా పల్లియగురుగే (శ్రీలంక) ఎడమ చెవికి తగిలింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న రుచిరాను ఫీజియో వచ్చి పరీక్షించాడు. చెవి నొప్పిగా ఉండడంతో అంపైర్ మైదానం వీడాడు.
తన వల్లే అంపైర్ రుచిరా గాయపడడంతో వీపు తడుతూ సారీ చెప్పాడు హ్యారిస్. ఈ వీడియో చూసినవాళ్లంతా రిఫరీపై కోపాన్ని అంపైర్ మీద తీర్చుకున్నారా? అని కొందరు అంటుండగా.. ఎంతైనా, పాక్ ఆటగాళ్ల తీరే వెరైటీ అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. రుచిరా స్థానంలో గాజీ సోహెల్ మ్యాచ్ ముగిసేంత వరకూ అంపైరింగ్ చేశాడు. షాహీన్ ఆఫ్రిది (29*, 2/16) ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థిపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపొంది సూపర్ 4కు చేరుకుంది. ఫైనల్ బెర్తు కోసం పాక్ జట్టు సెప్టెంబర్ 21 ఆదివారం భారత్‌ను ఢీకొట్టనుంది.
గ్రూప్ ‘ఏ’ రెండో మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ ఆ తర్వాత షేక్ హ్యాండ్ వ్యవహారాన్ని పెద్ద రాద్దాంతం చేసింది. టాస్ సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft) చొరవ చూపకపోవడం వల్లనే టీమిండియా కెప్టెన్ సూర్య తమ నాయకుడు సల్మాన్ అఘాతో కరచాలనం చేయలేదని దుయ్యబట్టింది. అంతేనా.. రిఫరీని మార్చకుంటే తమ జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుందని ఆ దేశ బోర్డు బీరాలు పలికింది.
No handshake by Indian team.
Pakistan waited for handshake but India went to the dressing room and closed the doors 🔥💥
The MESSAGE was LOUD AND CLEAR 💥🥶#INDvPAK #INDvsPAK #indvspak2025 #AsiaCupT20
— Pan India Review (@PanIndiaReview) September 14, 2025
కానీ, ఐసీసీ మాత్రం ‘మీ ఇష్టం.. ఆడితే ఆడండి లేకుంటే లేదు.. రిఫరీ ఆండీని మార్చే ప్రసక్తే లేద’ని స్పష్టం చేసింది. దాంతో.. యూఈఏతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని భావించిన పాక్.. టాస్ వేళకు మైదానం చేరుకోలేదు. మరోసారి ఐసీసీకి లేఖ రాసి తమకు వేరే రిఫరీని కేటాయించాలని కోరింది. అయినా సరే ‘అస్సలు కుదరద’ని జై షా నేతృత్వంలోని ఐసీసీ కరాఖండీగా చెప్పేసింది. దాంతో.. చేసేదేమీ లేక ఉసూరుమంటూ అబుదాబీ స్టేడియం చేరుకుంది పాక్ జట్టు.