PAK vs SA: వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత తడబడ్డా మిడిలార్డర్ రాణించడంతో నిలబడింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50, 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సౌద్ షకీల్ (52 బంతుల్లో 52, 7 ఫోర్లు) , షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో స్పిన్నర్ తబ్రేజ్ షంషీ నాలుగు వికెట్లతో పాకిస్తాన్ మిడిలార్డర్‌ను దెబ్బకొట్టాడు. జాన్సెన్కు మూడు వికెట్లు దక్కాయి.
చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కు ఆదినుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కో జాన్సెన్ పాకిస్తాన్‌కు వరుస ఓవర్లలో డబుల్ షాకులిచ్చాడు. అబ్దుల్లా షఫీక్ (9), ఇమామ్ ఉల్ హక్ (12) వికెట్లు అతడి ఖాతాలోకే వెళ్లాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (31)తో కలిసి మూడో వికెట్‌కు 56 బంతుల్లో 48 పరుగులు జోడించారు. కానీ ఈ జోడీని కొయెట్జ్ విడదీశాడు. రిజ్వాన్ నిష్క్రమించినా ఇఫ్తికార్ అహ్మద్ (21)తో కలిసి నాలుగో వికెట్‌కు 43 పరుగులు జతచేశాడు బాబర్. ఇఫ్తికార్‌ను షంషీ పెవిలియన్‌కు పంపాడు. అర్థ సెంచరీ చేసుకున్న తర్వాత బాబర్ కూడా అతడి బౌలింగ్‌లోనే వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆదుకున్న షకీల్ – షాదాబ్..
141 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ను షకీల్ – షాదాబ్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ సఫారీ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కున్నారు. ఆరో వికెట్‌కు 71 బంతుల్లోనే 84 పరుగులు జోడించిన ఈ జోడీని షంషీ విడదీశాడు. షాదాబ్ నిష్క్రమించిన కొద్దిసేపటికే అర్థ సెంచరీ పూర్తిచేసిన షకీల్ కూడా పెవిలియన్ చేరాడు. ఆఖర్లో మహ్మద్ నవాజ్ (24 బంతుల్లో 24, 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి పాకిస్తాన్ పోరాడే స్కోరును అందించాడు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఇదేం పెద్ద లక్ష్యమేమీ కాకపోయినా చెన్నైలో బంతి ఊహించినదానికంటే ఎక్కువ టర్న్ అవుతుంది. షాదాబ్, నవాజ్ తో పాటు పాక్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరి పాక్ బౌలర్లు ఏం చేస్తారో చూడాలి..