Shaheen Shah Afridi: పాకిస్తాన్ యువ సంచలనం, ఆ జట్టు పేసర్ షహీన్ షా అఫ్రిది కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేలలో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ తాంజిద్ హసన్ తో పాటు నజ్ముల్ హోసేన్ శాంతోను ఔట్ చేయడం ద్వారా అఫ్రిది వన్డేలలో వంద వికెట్లు పడగొట్టాడు. వంద వికెట్లు పడగొట్టేందుకు షహీన్ 51 మ్యాచ్లు తీసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.
బంగ్లాతో మ్యాచ్లో రెండు వికెట్లు తీయడం ద్వారా షహీన్ ఈ ఘనత సాధించగా దిగ్గజ బౌలర్ల రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్.. 52 మ్యాచ్లలో ఈ ఘనత అందుకున్నాడు. కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ తో పాటు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు 54 మ్యాచ్లలో వంద వికెట్లు సాధించారు. ఆసీసీ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ.. 55 మ్యాచ్లలో ఈ ఘనత అందుకున్నాడు.
Shaheen Shah Afridi is the fastest to complete 100 wickets in ODI history. [Fast bowlers] pic.twitter.com/Ybo3fWwdch
— Johns. (@CricCrazyJohns) October 31, 2023
కాగా పాకిస్తాన్ తరఫున అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించినవారిలో షహీన్.. సక్లయిన్ ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ముస్తాక్.. 53 మ్యాచ్లలో వంద వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో వకార్ యూనిస్ (59 మ్యాచ్లు), షోయభ్ అక్తర్ (60 మ్యాచ్లు), నవేద్ ఉల్ హసన్ (65 మ్యాచ్లు) లు ఈ ఘనత సాధించారు.
అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ బౌలర్ సందీప్ లమిచానె.. 42 మ్యాచ్లలో వంద వికెట్లు సాధించి ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. రషీద్ ఖాన్ 44 మ్యాచ్లలో ఈ ఘనత సాధించగా అఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల పరంగా చూస్తే మాత్రం.. అఫ్రిదినే అందరికంటే ముందున్నాడు.