బెంగళూరు : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్స్ కర్నాటకతో పాటు సౌరాష్ట్ర సెమీస్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. క్వార్టర్స్ పోరులో కర్ణాటక. పటిష్ట ముంబైని చిత్తుచేయగా మరోపోరులో టోర్నీ ఆసాంతం ఓటమన్నదే లేకుండా సాగిన ఉత్తరప్రదేశ్‌ను ఓడించిన సౌరాష్ట్ర సెమీస్ చేరుకుంది. బీసీసీఐ సీవోఈ వేదికగా జరిగిన తొలి క్వార్టర్స్‌లో ముంబై.. 50 ఓవర్లలో 254/8 రన్స్ చేయగా కర్ణాటక బ్యాటింగ్ చేస్తుండగా (33 ఓవర్లలో 132/1 వద్ద) ఆటకు వర్షం అంతరాయం కల్గింది.
దీంతో విజేతను వీజేడీ (వి. జయదేవన్ సిస్టమ్) పద్ధతిలో తేల్చగా కర్ణాటక 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ (81), వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (74) నాటౌట్‌గా నిలిచి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక యూపీ, సౌరాష్ట్ర పోరుకూ వరుణుడు ఆటంకం కల్గించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత ఓవర్లలో 310/8 రన్స్ చేసింది. ఛేదనలో సౌరాష్ట్ర 238/3 వద్ద ఉండగా వాన రావడంతో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో ఆ జట్టు గెలుపొందింది.