ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానాపై వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పేసర్ జహనారా ఆలమ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లా పురుషుల జట్టు మాజీ పేసర్ మంజురల్ ఇస్లాం తనను లైంగికంగా వేధించాడని చెప్పడంతో ఆ దేశ క్రికెట్లో దుమారం రేగింది. 2022లో మహిళా జట్టుకు సెలక్టర్గానే గాక టీమ్ మేనేజర్‌గానూ పనిచేసిన మంజురల్.. తనను నెలసరి గురించి అడిగేవాడని, పదే పదే భుజంపై చేయి వేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని ఆలమ్ వ్యాఖ్యానించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలమ్ మాట్లాడుతూ.. ‘ఒక్కసారి కాదు. చాలాసార్లు (లైంగిక వేధింపులపై) ఇలా జరిగింది.
జట్టులో ఉన్నప్పుడు మేం వాటి గురించి బయటకు చెప్పుకోలేం. ఒకవేళ ధైర్యంగా చెప్పినా అక్కడ న్యాయం జరుగదు. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా మాకు అక్కడ ప్రీక్యాంప్ను నిర్వహించారు. నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. టీమ్ మేనేజర్‌గా ఉన్న మంజూ (మంజురల్) భయ్యా నా దగ్గరకు వచ్చి.. నా చేతిని పట్టుకుని నా భుజం దగ్గర గట్టిగా నొక్కాడు. చాలామంది అమ్మాయిలతో అతడు అలాగే ప్రవర్తించేవాడు.
నా చెవి దగ్గరకు వచ్చి నా పీరియడ్స్ గురించి అభ్యంతకర ప్రశ్నలు వేశాడు. అప్పుడు అతడి ప్రతిపాదన విన్నాక నాకు భయం వేసింది’ అని తెలిపింది. ఈ ఆరోపణలపై మంజురల్ స్పందిస్తూ.. ఇవన్నీ నిరాధారమని అన్నాడు. ఇదిలాఉండగా ఆలమ్ ఆరోపణలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో విచారణ కమిటీ తమకు నివేదికను సమర్పించాలని.. ఈ విషయంలో ప్రభుత్వ సహాయమూ తీసుకుంటామని తెలిపింది.