First Hat trick: సుదీర్ఘ చరిత్ర ఉన్న క్రికెట్లో రికార్డులకు కొదవలేదు. వేలాది మంది క్రికెటర్లు ఎందరో తమ పేరు మీద వందలాది రికార్డులను నమోదుచేసుకున్నారు. వేలాది పరుగులు చేసిన బ్యాటర్లు.. వందలాది వికెట్లు తీసిన బౌలర్లు.. లెక్కకుమిక్కిలి క్యాచ్‌లను పట్టిన ఫీల్డర్లు.. ఇలా ఎన్ని రికార్డులున్నా ఒక మ్యాచ్‌లో బౌలర్ ‘హ్యాట్రిక్’ తీస్తే దానికుండే ప్రత్యేకతే వేరు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే నమోదయ్యే ఈ ఘనతను దక్కించుకున్న బౌలర్లు కూడా తక్కువమందే ఉంటారు. మరి అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటిసారిగా వరుసగా మూడు వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ నెలకొల్పిన ఆటగాడు ఎవరో తెలుసా..? ఆస్ట్రేలియా దిగ్గజం ఫ్రెడరిక్ స్పోఫోర్త్ పేరిట ఆ ఘనత ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది జనవరి 2వ తేదీనే కావడం గమనార్హం.
ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే ఫ్రెడరిక్.. 1879 జనవరి 2న ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు ఆరంభ ఓవర్లలోనే ఫ్రెడరిక్ చుక్కలు చూపెట్టాడు. వెమోన్ రాయల్, ఫ్రాన్సిస్ మెక్‌కిన్నన్, టామ్ ఎమ్మెట్‌లను ఔట్ చేసి తొలి హ్యాట్రిక్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫ్రెడరిక్.. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 48 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫ్రెడరిక్ మరింత చెలరేగాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు వేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 13 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాకు టెస్టులలో ఇంగ్లండ్‌పై ఇదే తొలి సిరీస్ విజయం.
On the first day of the Ashes series, remembering the man who perhaps created them.
Frederick Robert Spofforth.
“The Demon”
The man who shouted “Boys! This can be done” when England needed just 85 to win at the Oval in 1882.
They made 77.
The Demon: 28-15-44-7 pic.twitter.com/4atrIPAk7M
— Nimish Dubey (@nimishdubey) December 8, 2021
ఫ్రెడరిక్ తన కెరీర్లో ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1877-1887 వరకు 10 ఏండ్ల పాటు క్రికెటింగ్ కెరీర్లో 18 టెస్టులు ఆడాడు. 18 టెస్టులలో 94 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనత ఏడుసార్లు ఉండగా మ్యాచ్‌లో పది వికెట్లు నాలుగు సార్లు తీశాడు. 1926లో చనిపోయిన ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ 1996లో హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపునివ్వగా 2009లో ఐసీసీ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపునిచ్చింది. టెస్టులలో ఫ్రెడరిక్ తొలి హ్యాట్రిక్ నమోదుచేయగా వన్డేలలో పాకిస్తాన్‌కు చెందిన జలాల్ ఉద్ దిన్.. 1982లో తొలి హ్యాట్రిక్ నమోదు (ఆస్ట్రేలియాపై) చేశాడు. టీ20లలో ఈ ఘనత సాధించింది ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ. ఈ ఆసీస్ మాజీ పేసర్.. 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదుచేశాడు.