Olympic Winners : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్(Manu Bhaker) జెండా పండుగలో పాల్గొన్నది. భారత ఒలింపిక్ బృందంతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్ర ఉత్సావాలను తిలకించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి యువ షూటర్ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చింది.
ఓ పిస్టల్‌ను ప్రధానికి ఆమె కానుకగా అందించింది. అనంతరం అది ఎలా పనిచేస్తుందో కూడా ఒలింపిక్ విజేత ప్రధానికి వివరించింది. భాకర్ ఇచ్చిన తుపాకీని మోదీ ఆసక్తిగా గమనించారు. ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
భారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒలింపిక్ విజేతలను కలిశారు. ఒలింపిక్స్‌లో కంచుమోత మోగించిన మను భాకర్, స్వప్నిల్ కుశాలె వరుసగా రెండో కాంస్యం గెలుపొందిన హాకీ ఆటగాళ్లు, యువరెజ్లర్ అమన్ షెహ్రావత్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు కొద్దిలో పతకం చేజార్చుకున్న షట్లర్ లక్ష్య సేన్‌తో ప్రధాని ముచ్చటించారు. భారత ఒలింపిక్ బృందంతో ప్రధాని సంభాషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భాకర్.. పారిస్‌లో పతక గర్జన చేసింది. కోచ్ జస్పాల్ రానా సలహాలతో ఆటలో మెరుగైన భాకర్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మను భాకర్ కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది.
అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది. స్వప్నిల్ కుసాలే సైతం చెక్కు చెదరని గురితో కాంస్యం అందించాడు. అనంతరం హాకీ జట్టు రెండోసారి కాంస్యంతో గర్జించింది. ఇక అంచనాలను అందుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో మెరవగా.. యువ రెజ్లర్ అమన్ షెహ్రావత్ కాంస్యతో పతకాల సంఖ్యను అరడజనుకు పెంచాడు.