రాయపూర్: స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీస్ ఇన్ఫార్మర్గా మావోయిస్టులు అనుమానించారు. బంధువు చనిపోవడంతో సొంత గ్రామానికి వచ్చిన అతడ్ని కొట్టి చంపారు. (Boy Beaten To Death By Maoists) ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పువర్తి గ్రామానికి చెందిన 16 ఏళ్ల శంకర్, దంతెవాడ జిల్లా పల్నార్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. వారం రోజుల క్రితం కాన్సు సమస్య వల్ల కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించడంతో పువర్తికి వచ్చాడు. అయితే పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించిన మావోయిస్టులు మంగళవారం రాత్రి ఆ యువకుడిని కొట్టి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం శంకర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు శంకర్ అన్నయ్య 19 ఏళ్ల సోయం సీతారామ్‌ను కూడా వారం రోజుల కిందట మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వని కుటుంబ సభ్యులు గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత మావోయిస్టుల భయంతో శంకర్ కుటుంబం గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిందని పోలీసులు తెలుసుకున్నారు.