Olympic Medal | పారిస్: వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అనేది ప్రతి అథ్లెట్ కల. స్వర్ణం, రజతం, కాంస్యం.. రంగు ఏదైనా ఒలింపిక్ మెడల్ అనేది చాలామందికి ‘వన్స్ ఇన్ ఏ లైఫ్‌టైమ్ మూమెంట్’ వంటిది. అందుకే క్రీడాకారులు తమ పతకాలను అపురూపంగా చూసుకుంటుంటారు. కానీ పారిస్‌లో విజేతలకు ఇచ్చిన పతకాలు రెండు వారాలు కూడా కాకముందే ‘రంగు’ మారుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన స్కేట్ బోర్డింగ్ ప్లేయర్ న్యజా హోస్టన్ ఇదే విషయాన్ని ఎత్తిచూపాడు. గత నెల 29న అతడు కాంస్య పతకం గెలిచాడు.
కానీ వారం రోజులు కూడా తిరగకముందే అది రంగు మారిపోయిందని, క్రీడాకారులకు నాసిరకమైన పతకాలు అందించారని అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అంతేగాక హోస్టన్ ‘నాకు దక్కిన పతకం చూడటానికి అబ్బురపరిచేలా కనిపిస్తోంది. కానీ అది నా శరీరానికి ఉండే చెమటకు తాకడంతో పాటు నా స్నేహితులు దానిని ముట్టుకోవడంతో రంగు వెలిసిపోయింది’ అని రాసుకొచ్చాడు. దీంతో ఒలింపిక్స్ నిర్వాహకులు హోస్టన్కు మరో పతకం అందించారు. ఒలింపిక్ పతకాలను ఈసారి ప్రతిష్టాత్మక ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఉక్కు నుంచి తయారుచేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే.