న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్‌లను బెంగళూరు నుంచి ముంబైకి మారుస్తూ ఐసీసీ శుక్రవారం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఇటీవల ఐపీఎల్ టైటిల్ గెలిచిన జోష్‌లో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట ఘటనతో సీన్ మొత్తం మారిపోయింది.
తొక్కిసలాటపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీయడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మ్యాచ్‌లను బెంగళూరు నుంచి ముంబైకి మార్చాల్సి వచ్చింది. ‘అనుకోని కారణాల వలన వేదికను వేరే చోటికి మార్చాల్సి వచ్చింది. మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఐదు ప్రపంచ స్థాయి వేదికలను సిద్ధం చేశాం’ అని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నాడు. సెప్టెంబర్ 30 నుంచి మెగాటోర్నీ మొదలుకానుంది.