ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు నిర్దేశించిన 165 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్.. ఒకదశలో 70/2తో గెలుపు దిశగా సాఫీగా సాగినా ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ (3/26), సీల్స్ (3/32) విజృంభణతో 107/9గా మారి పరాభవం వైపుగా వెళ్లింది.
కానీ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (28 బంతుల్లో 55 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు అసాధారణంగా పోరాడాడు. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 20 రన్స్ అవసరమవగా.. షెపర్డ్ వేసిన ఆ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ కొట్టిన అతడు.. తర్వాత 3 బంతుల్లో 6 పరుగులే చేయగలిగాడు.