NZ vs PAK Preview: సుదీర్ఘ విరామం అనంతరం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టు.. వరల్డ్‌కప్ ఆరంభంలో జోరు కనబర్చింది. మెగాటోర్నీ కోసం నేరుగా హైదరాబాద్‌లోనే అడుగుపెట్టిన పాకిస్థాన్.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో నాకౌట్‌కు అర్హత సాధించడం పక్కా అన్నట్లు చెలరేగిపోయింది. ఆ తర్వాత అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన పోరుతో ఆ జట్టు పరిస్థితి తలకిందులైంది. ఆ తర్వాత లయం అందుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పాక్.. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాలు ఎదుర్కొంది.
ఇక ముందడుగు వేయడం కష్టమే అనుకుంటున్న తరుణంలో గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్.. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. వరల్డ్‌కప్ ఆరంభంలో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగిన న్యూజిలాండ్.. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కాగా.. మరో ముగ్గురు ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు.
చిన్న స్టేడియంలో చిందేసేది ఎవరో!
దాదాపు ఒకే స్థితిలో ఉన్న ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా శనివారంకీలక పోరు జరగనుంది. ముందంజ వేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు పాకిస్థాన్‌కు రన్‌రేట్ కూడా కీలకం కానుంది. అందుకే మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేసి కివీస్‌ను చుట్టేయాల్సిన పరిస్థితి నెలకొంది. పేసర్ మ్యాట్ హెన్రీ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బ కాగా.. అతడి స్థానాన్ని ఆరడుగుల ఆజానుభావుడు కైల్ జెమీసన్ భర్తీ చేయనున్నాడు. ఇప్పటికే విలియమ్సన్, నీషమ్, మార్క్ చాప్మన్ గాయాలతో ఇబ్బంది పడుతుండటం కివీస్‌ను కలవరపెడుతున్నది. మరి తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఎవరు ముందంజ వేస్తారనేది ఆసక్తికరం. న్యూజిలాండ్‌కు కాన్వే, రచిన్ రవీంద్ర, డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ కీలకం కానుండగా.. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీఖ్, ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్‌పై పాక్ ఆశలు పెట్టుకుంది. ఇక బౌలింగ్‌లో ఇరు జట్లకు మంచి పేస్ బలగం అందుబాటులో ఉంది.