లండన్: 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. సోమవారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ జొకో.. 1-6, 6-4, 6-4, 6-4తో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్ను చిత్తుచేశాడు. వింబుల్డన్‌లో క్వార్టర్స్ చేరడం జొకోకు ఇది ఏకంగా 16వ సారి కావడం విశేషం.
తొలి సెట్ ఓడినప్పటికీ తర్వాత పుంజుకునే అలవాటున్న జొకో.. అదే తీరును కొనసాగిస్తూ ఆస్ట్రేలియా ఆటగాడిపై ఆధిపత్యం చెలాయించాడు. క్వార్టర్స్‌లో అతడు ఇటలీ కుర్రాడు, 22వ సీడ్ ఫ్లావియోతో తలపడనున్నాడు. ఇక జొకో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను వీక్షించేందుకు గాను స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వింబుల్డన్‌లో భారత్ పోరు ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక ఆటగాడు యుకీ బాంబ్రీ.. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఓడి ఇంటిబాట పట్టాడు.