Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ప్యారిస్ మాస్టర్స్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్ ఆటగాడు టల్లాన్ గ్రీస్పూర్పై అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో తడబడినప్పటికీ చాంపియన్ ఆటతో ప్రత్యర్థిపై 4-6, 7-6(2), 6-4తో గెలుపొందాడు. తొలి సెట్లో వెనకబడిన జకో చాలా బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డెవిస్ కప్ తర్వాత ఆరువారాల విరామం కారణంగా జకోవిచ్ కోర్టులో వేగంగా కదలేకపోయాడు. అయితే.. రెండో సెట్ తర్వాత పుంజుకున్న అతడు టల్లాన్కు చెమటలు పట్టించాడు.
‘గత రెండుమూడు రోజులుగా నాకు కడుపులో ఇబ్బందిగా ఉంది. అందుకనే కోర్టులో చురుకుగా కదలేకపోయాను. అయితే.. టై బ్రేక్ సాధించాక నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఉత్కంఠ పోరులో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ తెలిపాడు.
యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడుతున్న జకోవిచ్
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జకో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. దాంతో, టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక(24) గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 22 గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
నాలుగో సీడ్ ఆటగాడు జన్నిక్ సిన్నర్ అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక.. సెవన్త్ సీడ్ స్టెఫనోస్ త్సిత్సిపాస్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 7-6(2) 6-4 గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో అతడు రోమన్ సఫీయుల్లిన్తో తలపడనున్నాడు.