మెల్బోర్న్: టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) సంచలన ఆరోపణ చేశారు. తనపై విషప్రయోగం జరిగినట్లు పేర్కొన్నాడు. 2022లో మెల్బోర్న్లోని ఓ హోటల్లో తనకు విషపూరిత ఆహారం ఇచ్చినట్లు చెప్పాడు. సీసం, పాదరసం కలిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి తనను ఇబ్బందిపెట్టినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆ ఏడాది ఆస్ట్రేలియా నుంచి అతన్ని డిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ నెంబర్ వన్ ప్లేయర్ జోకోవిచ్ వీసాను రద్దు చేసి అతన్ని ఆస్ట్రేలియన్ ఓఎన్లో ఆడకుండా వెనక్కి పంపించేశారు. అయితే ఆ ఏడాది జరిగిన ఘటన గురించి తాజాగా జీక్యూ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.
కోవిడ్ టీకా వేసుకోని కారణంగా.. మెల్బోర్న్ హోటల్లో తనను నిర్బంధించారని, ఆ సమయంలో తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, మెల్బోర్న్ హోటల్లో తనకు ఇచ్చిన ఆహారంలో కలుషితం ఉన్నట్లు గుర్తించానన్నాడు. సెర్బియాకు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని గుర్తించానని, కానీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదని, ఎందుకంటే తన శరీరంలో అధిక స్థాయిలో ఖనిజం ఉన్నట్లు గుర్తించానన్నాడు. తన బాడీలో అధిక మోతాదులో లెడ్, మెర్క్యూరీ ఉన్నట్లు తెలిపాడు. విషపూరిత ఆహారాన్ని ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అదొక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు అతను చెప్పాడు.
24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జోకోవిచ్.. ఈ ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొననున్నాడు. ఆదివారం నుంచి ఆ టోర్నీ జరగనున్నది. 11వ సారి అతను ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు. 2022 ఆస్ట్రేలియా వివాదం తన కెరీర్‌ను ఇబ్బంది పెట్టినా.. ఆస్ట్రేలియా ప్రజల పట్ల తనకు ఎటువంటి ద్వేషభావం లేదన్నాడు. తానేమీ వ్యాక్సిన్‌ను అనుకూలం కాదు అని, వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కూడా కాదు అని, కానీ శరీరానికి తగిన వాటిని తీసుకునే హక్కు తనకు ఉందని, ఆ అంశంలో మరొకరి ప్రోద్భలం అవసరం లేదన్నాడు.