మెల్బోర్న్: నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) అనూహ్య రీతిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. అలెగ్జాండర్ జ్వెరేవ్తో సెమీస్ మ్యాచ్ ఆడుతున్న సమయలో అతను గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-6 స్కోరుతో జ్వెరేవ్ గెలుచుకున్న సమయంలో జోకోవిచ్‌కు గాయం తీవ్రమైంది. దీంతో ఆట నుంచి తప్పుకున్నాడు. జ్వెరేవ్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
వాస్తవానికి 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని జోకోవిచ్ కోల్పోయాడు. మంగళవారం కార్లోస్ అల్కరాజ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ సమయంలో తన ఎడమ కాలికి అతను టేపు వేసుకున్నాడు. ఇవాళ ఫస్ట్ సెట్ పాయింట్ వద్ద నెట్ కావడంతో.. జోకోవిచ్ నెట్ వద్దకు వెళ్లి జ్వెరేవ్తో హ్యాండ్స్ షేక్ చేశాడు. మైదానం నుంచి వెళ్లిపోతూ ప్రేక్షకుల దిశగా థంప్స్ అప్ చూపిస్తూ వెళ్లిపోయాడు.
మరోవైపు రాడ్ లేవర్ ఎరినాలో ప్రేక్షకులు మాత్రం అరుపులతో జోకోవిచ్‌ను ఆటపట్టించారు. ఎవరైనా గాయపడితే, ఆ క్రీడాకారుడిని వేధించవద్దు అని జ్వెరేవ్ తెలిపారు. జర్మనీకి చెందిన జ్వెరేవ్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. ఫైనల్లో సిన్నర్ లేదా బెన్ షెల్టన్‌తో జ్వెరేవ్ తలపడే అవకాశం ఉన్నది.