Novak Djokovic | పారిస్: పురుషుల టెన్నిస్‌లో రారాజు తానేనని నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి నిరూపించుకున్నాడు. గత ఏడాదికాలంగా తనను 25వ గ్రాండ్‌స్లామ్ అందుకోకుండా అడ్డుపడుతున్న స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కారజ్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఓడించి బదులు తీర్చుకున్నాడు.
ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 7-6 (7/3), 7-6 (7-2)తో అల్కారజ్‌ను చిత్తు చేసి తన కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ పసిడిని ముద్దాడాడు. సుదీర్ఘ కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకో ఖాతాలో ఇప్పటికే ఒలింపిక్స్ కాంస్యం (2008) కూడా ఉంది. ఫైనల్లో ఓడిన అల్కారజ్ రజతం గెలుచుకోగా ఇటలీ ఆటగాడు లొరెంజొ ముసెట్టికి కాంస్యం దక్కింది.