మెల్బోర్న్: టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఘనతను జోకోవిచ్ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడవ రౌండ్లోకి ప్రవేశించిన జోకోవిచ్ ఈ కొత్త మైలురాయి చేరుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో ఇప్పటి వరకు జోకోవిచ్ 430 మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. ఆ జాబితాలో రోజర్ ఫెదరర్ 429 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జోకోవిచ్ చెప్పాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జోకోవిచ్.. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. టెన్నిస్‌ను ప్రేమిస్తాను, పోటీలను ప్రేమిస్తాను, ప్రతిసారి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, 20 ఏళ్లుగా గ్రాండ్‌స్లామ్ పోటీల్లో ఆడుతున్నానని, ఓడినా..గెలిచినా.. పూర్తిగా ఆటను ఆస్వాదిస్తానన్నాడు.