మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచిచూస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు అదృష్టం ప్రత్యర్థికి గాయం రూపంలో కలిసొచ్చింది. ఐదో సీడ్ ఇటలీ కుర్రాడు లొరెంజొ ముసెట్టి వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్నా దురదృష్టం అతడిని గాయం రూపంలో వెక్కిరించింది. కుడి కాలి పైభాగంలో తీవ్ర నొప్పి కారణంగా నడవలేని స్థితికి వచ్చి మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో జొకో సెమీస్‌కు అర్హత సాధించాడు. బుధవారం రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జొకో.. 4-6, 3-6, 3-1తో సెమీస్‌కు చేరాడు. ముసెట్టి విజృంభణతో రెండు సెట్లనూ కోల్పోయిన జొకో మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. మూడో సెట్లో 3-1తో ఆధిక్యంలో ఉండటంతో మరో రసవత్తర పోరు తప్పదనే అనుకున్నారంతా.
కానీ అదే సమయంలో ముసెట్టి నడవడానికి ఇబ్బందిపడ్డాడు. మెడికల్ టైమౌట్ తీసుకున్నా అతడు ఆడే స్థితిలో లేకపోవడంతో మ్యాచ్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిశాక జొకో మాట్లాడుతూ.. ‘నేడు నాకంటే ముసెట్టి చాలా బాగా ఆడాడు. నేనైతే రాత్రికి ఇంటికి వెళ్తానేమోనని ఫిక్స్ అయ్యా. మ్యాచ్ పూర్తయ్యుంటే తప్పకుండా అతడే విజేతగా నిలిచేవాడు. కానీ ఆటలో గాయాలు సాధారణం. గతంలో పలుమార్లు నాక్కూడా ఇలా జరిగింది. ముసెట్టి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని చెప్పడం గమనార్హం. ప్రిక్వార్టర్స్‌లోనూ జాకుబ్ మెన్సిక్ (చెక్) గాయం కారణంగా జొకో నేరుగా క్వార్టర్స్ చేరుకున్న విషయం విదితమే. సెమీస్‌లో జొకో.. రెండో సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ)తో జరుగబోయే బ్లాక్‌బస్టర్ సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో క్వార్టర్స్‌లో సిన్నర్.. 6-3, 6-4, 6-4తో బెన్ షెల్టన్ (అమెరికా)పై వరుస సెట్లలో గెలిచి సెమీస్ చేరాడు.
స్వియాటెక్ నిష్క్రమణ
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్)కు కజకిస్థాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా షాకిచ్చింది. క్వార్టర్స్‌లో రిబాకినా.. 7-5, 6-1తో స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. రెండో క్వార్టర్స్‌లో యూఎస్ ప్లేయర్ జెస్సికా పెగులా.. 6-2, 7-6 (7/1)తో అమెరికాకే చెందిన అనిసిమొవను ఓడించింది. సెమీస్‌లో పెగులా.. రిబాకినాతో తలపడనుంది.