కోల్‌కతా: ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ నార్త్ఈస్ట్ యునైటెడ్ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ 6-1తో డైమండ్ హార్బర్ ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది నార్త్ఈస్ట్ తమ టైటిల్‌ను నిలబెట్టుకుని అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 34 ఏండ్ల క్రితం ఈస్ట్‌బెంగాల్ నెలకొల్పిన వరుస(1989, 90, 91)టైటిళ్ల రికార్డును ఈ మ్యాచ్ ద్వారా నార్త్ఈస్ట్ సమం చేసింది. మరోవైపు అరంగేట్రం టోర్నీలోనే ఫైనల్ చేరి అందరినీ ఆకట్టుకున్న డైమండ్ హార్బర్ టీమ్ తుది పోరులో ఘోరంగా తడబడింది.
మ్యాచ్ ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నార్త్ఈస్ట్ యునైటెడ్ తరఫున అశీర్(30ని), పార్థిబ్(45+ని), తోయ్(50ని), జైరో(81ని), అండీ(86ని), అజరాయ్(90+ని) గోల్స్ చేయగా, మాజ్సెన్(69ని)..డైమండ్ హార్బర్ టీమ్‌కు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ మొదలైన నిమిషం నుంచి బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న నార్త్ఈస్ట్.. డైమండ్ హార్బర్ డిఫెన్స్‌ను కకావికలు చేసింది. 30వ నిమిషంలో మొదలైన నార్త్ఈస్ట్ గోల్స్ పరంపర ఆఖరి వరకు కొనసాగింది. 137 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన డ్యురా ండ్ కప్‌లో విజేతగా నిలిచిన నార్త్ఈస్ట్కు రూ.1.21 కోట్ల ప్రైజ్‌మనీ దక్కడం విశేషం.