న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నిశాద్కుమార్, సిమ్రాన్శర్మ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ టీ47లో నిశాద్కుమార్ 2.14మీటర్ల ఎత్తు దూకి స్వర్ణం దక్కించుకున్నాడు. 26వ పడిలోకి ప్రవేశించిన నిశాద్..తాజాగా ఏషియన్ రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా నిశాద్కు ఇది పారాలింపిక్స్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ టోర్నీలో తొలి పసిడి కావడం విశేషం.
టోక్యోతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు రజతాలు సొంతం చేసుకున్న నిశాద్..ఈ మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మహిళల 100మీటర్ల టీ12 రేసును సిమ్రాన్శర్మ 11.95సెకన్లలో ముగించి స్వర్ణం సొంతం చేసుకుంది. తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరుస్తూ..తొలి పతకాన్ని అందుకుంది. మరోవైపు మహిళల 200మీటర్ల టీ35 రేసును ప్రీతి 30.03సెకన్లలో పూర్తి చేసి కాంస్యం ఖాతాలో వేసుకుంది. పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్64లో పర్దీప్ 46.23మీటర్లతో కాంస్యం దక్కించుకున్నాడు.