భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. అంతర్జాతీయ వేదికపై మరోమారు తళుక్కుమంది. తన పంచ్ పవర్ ఏంటో ప్రత్యర్థికి రుచి చూపిస్తూ ప్రతిష్ఠాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో పసిడి పతకంతో సత్తాచాటింది. 21 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మన తెలంగాణ బాక్సర్ దుమ్మురేపింది. గ్రేటర్ నోయిడాలో జరిగిన మెగాటోర్నీ తుదిపోరులో చైనీస్ తైపీ బాక్సర్ గువో యి జువాన్‌ను చిత్తుచేస్తూ నిఖత్ సగర్వంగా పసిడి పతకాన్ని ముద్దాడింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఈ ఇందూరు బాక్సర్ ముచ్చటగా మూడోసారి ద బెస్ట్ అనిపించుకుంది. పారిస్ ఒలింపిక్స్ వైఫల్యాన్ని మరిపిస్తూ.. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించింది. తాజా విజయంతో దేశఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్‌తో ‘నమస్తే తెలంగాణ’ మాటామంతీ..

సొంతగడ్డపై జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీ నాకు చాలా ప్రత్యేకమైంది. అభిమానుల అపూర్వ మద్దతు మధ్య మెండైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. 51కిలోల కేటగిరీలో బై లభించడంతో నేరుగా సెమీఫైనల్ బౌట్ ఆడే అవకాశం లభించింది. ఇదే అదనుగా సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గనీవా గుల్సెవర్ను 5-0తో చిత్తు చేసి ఫైనల్లోకి ప్రవేశించాను. భుజం గాయం నుంచి తేరుకున్న తర్వాత పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగిన ఈ టోర్నీ కీలకమైనదిగా భావించాను. అందుకు తగ్గట్లుగానే టోర్నీకి సన్నద్ధమయ్యాను. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేస్తూ పక్కా వ్యూహంతో పోటీకి దిగడం కలిసొచ్చింది. ఇందుకోసం గంటల పాటు ప్రాక్టీస్‌లో చెమటోడ్చాను. ఫైనల్ విషయానికొస్తే చైనీస్ తైపీ బాక్సర్ గువోయి జువాన్ గట్టిపోటీ ఇచ్చింది. ఎత్తును అదనపు బలంగా మలుచుకుంటూ జువాన్‌పై పంచ్‌ల వర్షం కురిపించాను. కౌంటర్ అటాకింగ్‌తో రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని పెంచుకోవడంతో పసిడి అందుకోగలిగా.

పారిస్ (2024) ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత మళ్లీ గాడిలో పడేందుకు చాలా సమయమే పట్టింది. పలు టోర్నీలకు సిద్ధమవుతున్న క్రమంలో భుజం గాయానికి గురయ్యాను. తిరిగి కోలుకునేందుకు చాలా కష్టపడ్డాను. పూర్తిస్థాయి ఫిట్నెస్ అందుకునేందుకు గంటలపాటు ప్రాక్టీస్ చేసేదాన్ని. దీనికి తోడు లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని బరువు కేటగిరీలో మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఈ స్వర్ణ పతకం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. వరుస టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయి. లివర్‌పూల్ వరల్డ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణాలు సాధించడం ద్వారా మీనాక్షి, జాస్మిన్ తమ సత్తాఏంటో చూపించారు. ఒలింపిక్స్ విభాగంలో పతకాలు నెగ్గడం మామూలు విషయం కాదు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా రాణించడం ఆనందంగా ఉంది. ఇదే దూకుడు కొనసాగిస్తూ రానున్న నేషనల్ సీనియర్స్ టోర్నీతో పాటు ఆసియా టోర్నీలో పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను.
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లేకపోవడం వెలితిగా ఉంది. మెరుగైన ప్రాక్టీస్ కోసం బళ్లారి (కర్ణాటక), పటియాల (పంజాబ్) వెళ్లాల్సి వస్తుంది. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారమే. ప్రభుత్వం సహకారం అందిస్తే హైదరాబాద్‌లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాను. తెలంగాణలో ప్రతిభ కలిగిన బాక్సర్లకు కొదువలేదు. కావాల్సిందల్లా సరైన సౌకర్యాలే. ముఖ్యంగా అమ్మాయిలు బాక్సింగ్‌ను కెరీర్‌గా మలుచుకునేందుకు ఈ మధ్య కాలంలో ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి మెరుగైన బాక్సర్లను తీర్చిదిద్దేందుకు అకాడమీ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అందుకు తగ్గట్లు అకాడమీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. తద్వారా రాష్ట్రంలో బాక్సింగ్ అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుంది.
లాస్ ఏంజెలిస్ (2028) ఒలింపిక్స్‌కు ఇంకా రెండున్నరేండ్ల సమయముంది. అందుకోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాను. టోర్నీని బట్టి బరిలోకి దిగుతూ పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను. వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌పై ప్రస్తుతం దృష్టి సారించాను. ఇలా కీలకమైన టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా ఒలింపిక్స్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. విశ్వక్రీడల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనీస్ తైపీ, జపాన్ బాక్సర్లను దీటుగా ఎదుర్కొవాలి. ఈ క్రమంలో గాయాల బారిన పడకుండా ఫిట్నెస్ కాపాడుకోవడం చాలా కీలకం.
– చెగ్గోజు రాజశేఖర్