నలుగురమ్మాయిల సంప్రదాయ కుటుంబం..
ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే ఎన్నో ఆంక్షలు..
ఇక ఆటల గురించే ఆలోచించడమే మహాపాపం అనే రీతిలో చివాట్లు..
ఇలాంటి కట్టుబాట్ల నుంచి బయపడేసి.. తన కూతురిని స్వేచ్ఛగా ఎదగనివ్వాలనుకున్నాడు ఓ తండ్రి.. ఖాన్దాన్, ఆజువాలే, బాజువాలే అని చూడకుండా.. ఆమె ఆలోచనలకు రెక్కలిచ్చాడు! తండ్రి ఇచ్చిన ధైర్యం.. కోచ్లిచ్చిన శిక్షణతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన ఆ మేలిమి బంగారమే.. ఈ రోజు ప్రపంచ చాంపియన్‌గా అవతరించి శెభాష్ అనిపించుకుంది!!
జిల్లా కేంద్రం నుంచి వచ్చింది.. ఆమెకు అంత సీన్ లేదు.. ప్రపంచ స్థాయి పోటీల్లో నెగ్గడమంటే.. జూనియర్ లెవల్లో మెడల్స్ కొట్టినట్లు కాదు.. ప్రాక్టీస్‌లోనే భుజం తొలిగింది.. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టడం కష్టమే..దిగ్గజ బాక్సర్ మేరీకోమ్తోనే తలపడేంత తలపొగరా..ఇలా ఆమె ఎదుర్కొన్న సవాళ్లకు లెక్కే లేదు..
ఎందరు అనుమానంగా చూసినా.. ఎన్ని అవమానాలు ఎదురైనా.. చేతికి గ్లౌజ్ తొడిగినప్పటి నుంచి కన్న కలను నిఖత్ జరీన్ పాతికేండ్లకే సాకారం చేసుకుంది. తను పోటీ పడుతున్న కేటగిరీలోనే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ ఉండటంతో.. ఇప్పటి వరకు తెర వెనుకకే పరిమితమైన ఆమె పంచ్ పవర్ ఏంటో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చాటి చెప్పింది. అవరోధాలను అధిగమించడాన్ని అమితంగా ఇష్టపడే ఈ ఇందూరు బాక్సర్.. ఇక్కడితో ఆగిపోకుండా ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానంటున్నది. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన సవాళ్ల వివరాలు ఆమె మాటల్లోనే..
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఆనందం మాటల్లో వర్ణించలేను. కఠోర శ్రమకు దక్కిన విజయమిది. ఈ ప్రయాణంలో వెన్నంటి నిలిచిన భాస్కర్ భట్ సర్, నా కోచ్‌లు, సాయ్కు ధన్యవాదాలు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగస్వామి కావడం ఎంతో ఉపకరించింది. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం గర్వంగా ఉంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా చిన్నప్పటి నుంచి పోరాడటాన్ని అలవాటు చేసుకున్నా.. ఫలితంతో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కృషి చేశా.
పారిస్ ఒలింపిక్సే లక్ష్యం..
నేషనల్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పారిస్ సన్నాహకాలు షురూ’ అని రాసుకున్నా. అప్పటి నుంచే 2024 ఒలింపిక్స్ కోసం కష్టపడుతున్నా. ఈ క్రమంలో ఏ టోర్నీలో పాల్గొన్నా.. గెలుపొటముల గురించి కాకుండా.. అనుభవం గడించడంపై దృష్టి సారించా. అది నాకు విశ్వక్రీడల్లో తొడ్పడుతుందని బలంగా నమ్ముతున్నా. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా.. అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
అన్నీ ఏకపక్ష విజయాలే
గత రెండేండ్లుగా తీవ్రంగా శ్రమించా. దాని ఫలితంగానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దేశానికి పసిడి పతకం అందించగలిగా. నా బలహీనతలు గుర్తించి.. వాటినే బలాలుగా మార్చుకునేందుకు ఎంతో సాధన చేశా. నిరుడు చాలా టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలిచా.. ఆ అనుభవం వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పనికొచ్చింది. మెగాటోర్నీలో బరిలోకి దిగిన అన్నీ బౌట్లలో ఏకపక్ష విజయాలు సాధించా. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా.
చిరకాల స్వప్నమది..
ఇప్పటికి సాధించిన దానితో సంతృప్తిపడను. దేశం తరఫున పతకాలు సాధించేందుకు మరింత కష్టపడుతా. నా టైం వచ్చేసింది. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలపై దృష్టి పెట్టా. వాటి కోసమే సిద్ధమవుతున్నా. పారిస్ (2024)ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. నా చిరకాల స్వప్నమదే.
ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి నిఖత్ కలను సాకారం చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టానష్టాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగింది. బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి వరల్డ్ టైటిల్ వరకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అడ్డంకులను అవలీలగా అధిగమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ దేశ బాక్సింగ్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. కెరీర్ తొలి నాళ్లలో ఆర్థిక ఇబ్బందులు, ఆ తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు దూరమైనా నిఖత్ ధృడ చిత్తాన్ని కోల్పోలేదు. పడిలేచిన కెరటంలా నిలబడింది. ఈ క్రమంలో లోపాలపై దృష్టి సారిస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది.
ఇటీవల స్ట్రాంజా టోర్నీలో రెండోసారి స్వర్ణ పతకం గెలువడంతో పాటు జాతీయ టోర్నీలో సత్తాచాటడం ద్వారా ఆమె ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పింది. టర్కీలో మరోమారు విజయపతాకాన్ని ఎగరవేస్తూ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం మరువలేనిది. సీఎం కేసీఆర్ అండతో బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటింది. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కవిత అందించిన సహకారం అద్భుతం. భవిష్యత్‌లోనూ నిఖత్ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తుందన్న నమ్మకం నాకుంది. ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇస్తారని ఆశిస్తున్నాం. దేశ ప్రజలకు నిఖత్ పతకాన్ని అంకితం చేసి ఉద్దేశమేంటో చాటింది.
ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
– కేటీఆర్, ఐటీ మంత్రి