హైదరాబాద్, ఆట ప్రతినిధి: శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ బరిలోకి దిగుతున్నది. ఈనెల 27 నుంచి జూలై 1వ తేదీ వరకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే టోర్నీలో నిఖత్‌తో పాటు ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహైన్, వరల్డ్ యూత్ చాంపియన్ అంకుశిత బొరో పోటీపడబోతున్నారు.
భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ), సాట్స్ సహకరంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో మొత్తం 15 జట్లు తలపడనున్నాయి. ఇందులో ఆతిథ్య తెలంగాణ సహా రైల్వేస్, హర్యానా, ఆల్ఇండియా పోలీస్, సర్వీసెస్, పంజాబ్, చండీగఢ్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కిం, సాయ్ టీమ్ బరిలో ఉన్నాయి.