హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం మొదలైన మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళ 48-51కిలోల తొలి రౌండ్లో బరిలోకి దిగిన నిఖత్ 4-1తో రాశిశర్మ(ఉత్తరప్రదేశ్)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది.
తన అనుభవాన్ని వినియోగించుకుంటూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మిగతా బౌట్లలో తెలంగాణకు చెందిన యషిశర్మ 5-0తో మోనిశ(తమిళనాడు)పై గెలువగా, పూజ బిశ్వాస్..గితిమోని గొగోయ్(సాయ్), కీర్తి బండి..గరిమ(రాజస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. బీఎఫ్ఐ సహకారంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్, సాట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు.