Boxing | నమస్తే తెలంగాణ క్రీడా : మనదేశంలో రెజ్లింగ్ (మల్లయుద్ధం) మాదిరిగానే బాక్సింగ్ సైతం పురాతన క్రీడ. మహాభారత కాలంలో ‘ముష్ఠియుద్ధ’గా పేరుగాంచిన నేటి బాక్సింగ్.. 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1904 ఒలింపిక్స్ (సెయింట్ లూసియా)లో ఈ క్రీడను ప్రవేశపెట్టినా ఆ తర్వాత నాలుగున్నర దశాబ్దాలకు (1948 లండన్ ఒలింపిక్స్‌లో) భారత్ అరంగేట్రం చేసింది. 1972 నుంచి ప్రతి ఎడిషన్‌లోనూ భారత్ ప్రాతినిథ్యం ఉన్నా 2008 బీజింగ్ ఒలింపిక్స్ దాకా మన బాక్సర్లు రిక్తహస్తాలతోనే తిరిగివచ్చారు. కానీ బీజింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పంచ్ విసిరి దేశానికి తొలి పతకాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 2012లో మేరీ కోమ్, 2020లో లవ్లీనా బోర్గొహెయిన్ కాంస్యాలు నెగ్గారు. పారిస్‌లో భారత్‌కు పతకం తెచ్చే రేసులో ఉన్న ఈవెంట్స్‌లో బాక్సింగ్ కూడా ఒకటి. ఈసారి ఆరుగురు బాక్సర్లతో బరిలోకి దిగుతున్న భారత్.. పతక పంచ్‌లు విసిరేనా?
భారత బాక్సింగ్ చరిత్రలో ఓ సంచలనంగా ఎదిగిన నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్.. పారిస్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌తో సెలక్షన్ ట్రయల్స్ వివాదం ఆమెలో మరింత పట్టుదలను నింపింది. ఆ తర్వాత 2022, 2023 వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలలో వరుసగా స్వర్ణాలు గెలిచి మేరీకోమ్ వారసురాలిగా గుర్తింపుపొందింది. కామన్వెల్త్లో రజతం నెగ్గిన ఈ ఇందూరు అమ్మాయి.. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుని ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. రింగ్‌లోకి దిగిందంటే ప్రత్యర్థులపై సింహాంలా విరుచుకుపడుతూ వేగంగా పాయింట్లు సాధించే నిఖత్.. ఏదో ఒక పతకం కాకుండా ఏకంగా పసిడి పంచ్ విసరడానికి సిద్ధమైంది. 50 కిలోల విభాగంలో బరిలో ఉన్న నిఖత్ భారత్‌కు పతకం పక్కా తెచ్చే క్రీడాకారుల జాబితాలో ముందంజలో ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో ఏ అంచనాలు లేకుండానే బరిలోకి దిగి కాంస్యం గెలుచుకున్న 26 ఏండ్ల అసోం అమ్మాయి ఈసారి పతకం రంగు మార్చాలని భావిస్తోంది. అయితే గత ఒలింపిక్స్‌లో 69 కిలోల విభాగంలో బరిలో నిలిచిన లవ్లీనా ఈసారి 75 కిలోలకు మారడమే అతిపెద్ద సవాలు. గత మూడేండ్ల పాటు ఆమె ప్రదర్శన అంత ఆశాజనకంగా లేకపోయినా ఆసియా క్రీడల్లో రజతం, ఆసియా, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లలో స్వర్ణాలు సాధించి ఫామ్‌లోకి వచ్చింది. కానీ కొద్దిరోజుల క్రితమే ముగిసిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్లో ఒలింపిక్ శరణార్థుల జట్టు తరఫున ఆడిన కిండి ఎంగంబ చేతిలో అనూహ్య ఓటమి ఆమెను కలవరపరుస్తోంది.
మహిళల విభాగంలో నిఖత్, లవ్లీనాతో పాటు ప్రీతి పన్వర్ (54 కిలోలు), జాస్మిన్ లంబోరియా (57 కిలోలు) ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన 22 ఏండ్ల జాస్మిన్.. ప్రవీణ్ హుడాపై నాడా నిషేధం నేపథ్యంలో పారిస్ టికెట్ దక్కించుకుంది. మరోవైపు 20 ఏండ్ల అమ్మాయి ప్రీతి సైతం ఆసియా క్రీడల్లో సెమీస్ చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రీతి, జాస్మిన్‌పై పెద్దగా ఆశలేం లేకున్నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే క్వార్టర్స్ వరకు చేరడం పెద్ద కష్టమేం కాదు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన విజేందర్ తర్వాత మళ్లీ ఆ లోటును భర్తీ చేసేందుకు అమిత్ ఫంగాల్ (51 కిలోలు), నిషాంత్ దేవ్ (71 కిలోలు) పారిస్‌కు వెళ్లారు. టోక్యోలో నిరాశపరిచిన అమిత్.. ఆ అనుభవంతో పారిస్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలిచిన నిషాంత్.. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన బాక్సర్లను కంగుతినిపిస్తూ సత్తా చాటుతున్న దేవ్.. ఒలింపిక్స్‌లో ఏం చేస్తాడనేది ఆసక్తికరం.
