గ్రేటర్ నోయిడా: ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి)..మెగాటోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిఖత్‌తో పాటు జాస్మిన్ లంబోరియా(57కి), జాదుమణిసింగ్(50కి), పవన్ బర్తాల్(55కి), సచిన్ సివాచ్(60కి), హితేశ్ గులియా(70కి) తుది పోరుకు అర్హత సాధించారు. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీస్ బౌట్ విషయానికొస్తే..21 నెలల పతక నిరీక్షణకు తెరదించుతూ సత్తాచాటింది. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నిఖత్.. ఉబ్బెకిస్థాన్ బాక్సర్ గనీవా గుల్సెవర్‌పై 5-0తో ఏకపక్ష విజయం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో స్ట్రాంజా స్మారక టోర్నీ గెలిచిన తర్వాత ఇన్ని రోజులకు నిఖత్ తనదైన రీతిలో అదరగొట్టింది.
బౌట్లో మొదటి నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ నిజామాబాద్ బాక్సర్..ఉజ్బెక్ బాక్సర్‌కు ఏ మాత్రం అవకాశమివ్వలేదు. పవర్ఫుల్ పంచ్‌లకు తోడు బలమైన హుక్స్, జాబ్స్‌తో ముప్పేట దాడి చేసి గుల్సెవర్ ఊపిరి తీసుకోకుండా చేసింది. జరీన్ విసిరిన పంచ్‌లకు గుల్సెవర్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. బౌట్ ముగిసిన తర్వాత నిఖత్ మాట్లాడుతూ ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి మరిన్ని విజయాలు సాధిస్తానన్న నమ్మకం కల్గింది. సొంతగడ్డపై ప్రేక్షకుల మధ్య గతంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నేను..ఇప్పుడు సెమీస్‌కు వెళ్లి పతకం ఖాయం చేసుకున్నాను’ అని అంది. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్‌తో నిఖత్ తలపడనుంది. మరోవైపు జాస్మిన్ 5-0తో ఉల్జాన్ సార్స్న్బెక్(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది.