న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్లు మీనాక్షి, నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై శుభారంభం చేశారు. ఏర్పాట్లలో ఏర్పడిన సమస్యల కారణంగా ఆలస్యంగా జరిగిన బౌట్లలో ఈ బాక్సర్లు తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ముందంజ వేశారు. సోమవారం జరిగిన మహిళల 48-51కిలోల విభాగంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో నిధి(చండీగఢ్)పై సునాయాస విజయం సాధించింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
పవర్ఫుల్ పంచ్‌లతో చెలరేగుతూ రిఫరీల నుంచి పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో బౌట్(45కి-48కి)లో మీనాక్షి..లక్ష్య విజయన్(తమిళనాడు)పై గెలిచింది. మహిళల 70-75కిలోల తొలి బౌట్లో లవ్లీన..కృష్ణవర్మపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల 47-50కిలోల కేటగిరీలో సాగర్ 5-0తో అశుతోష్‌పై, 70-75కిలోల విభాగంలో సుమిత్..అర్ష్ప్రీత్సింగ్పై, 65-70కిలోలలో హితేశ్ 5-0తో అంకింత్పై, 55-60కిలోలలో సచిన్ 5-0తో తుషార్‌పై గెలిచి తదుపరి రౌండ్లోకి ప్రవేశించాడు.