NZW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ (Newzealand) ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు ఓటముల నుంచి తేరుకున్న కివీస్ శుక్రవారం బంగ్లాదేశ్‌పై పంజా విసిరింది. స్వల్ప స్కోరే చేసినా.. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ వంద పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ సోఫీ డెవినె బ్రూక్ హల్లిడె పోరాడగలిగే స్కోర్ అందించగా.. ఆ తర్వాత పేసర్ జెస్ కేర్ బంగ్లా టాపార్డర్ కుప్పకూల్చింది. స్పిన్నర్లు తిప్పేయగా వరుసగా వికెట్లు కోల్పోయిన బంగ్లా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. బ్యాటింగ్ యూనిట్ సమిష్టి వైఫల్యంతో ఆ జట్టకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.
వరల్డ్ కప్ ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్ తొలి విజయాన్ని రుచి చూసింది. మొదటి పోరులో ఆస్ట్రేలియా చేతిలో.. రెండో మ్యాచ్‌లో తంజిమ్ బ్రిట్స్ మెరుపు శతకంతో దక్షిణాఫ్రికాపై ఓడిన కివీస్.. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ప్రత్యర్థిని 127కే ఆలౌట్ చేసి వంద పరుగులతో సూపర్ విక్టరీ సాధించింది.
New Zealand get off the mark at #CWC25 with a convincing win over Bangladesh in Guwahati 💥#NZvBAN 📝: https://t.co/24vXg8OADd pic.twitter.com/ehAy2bmySk
— ICC (@ICC) October 10, 2025
వరల్డ్ కప్‌లో బౌలింగ్‌లో అదరగొడుతున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తేలిపోతోంది. న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన బంగ్లా ఛేదనలో మాత్రం చతికిలపడింది. కివీస్ పేసర్ మైర్ ఆదిలోనే ఓపెనర్ షర్మిన్ అక్తర్(3)ను ఔట్ చేసి బ్రేకిచ్చింది. ఆ
తర్వాత వికెట్ కాపాడుకునేందుకు అపసోపాలు పడిన రుబియా హైదర్(4)ను జెస్ కేర్ వెనక్కి పంపింది. దాంతో.. 13 పరుగులకే బంగ్లా రెండో వికెట్ పడింది. ఓపెనర్లు డగౌట్ చేరడంతో కెప్టెన్ నిగర్ సుల్తానా (4), శోభన మొస్త్రే (2)లు జట్టును ఆదుకోవాలనుకున్నారు. దాంతో, బౌండరీలు కొట్టే సాహసం చేయలేదు వీళ్లు. కానీ, పవర్ ప్లే చివరి ఓవర్లో కేర్ మరోసారి దెబ్బకొడుతూ డేంజరస్ శోభన వికెట్ సాధించింది.
New Zealand get their first W of the tournament ✅#NZvBAN SCORECARD: https://t.co/jOExSYirj7 pic.twitter.com/maw3Aylwi3
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2025
అంతే.. బంగ్లా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. పెద్దషాట్తో ఒత్తిడి తగ్గించుకోవాలనుకున్న నిగర్ సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఫాహిమా ఖాతూన్ (34), రబెయా ఖాన్(25)లు భారీ ఓటమి తప్పించేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ అతికష్టమ్మీద జట్టు స్కోర్ వంద దాటించారు. ఎనిమిదో వికెట్‌కు 44 రన్స్ చేసిన రబెయను కేర్ ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరి బ్యాటర్ అక్తర్‌ను తహుహు బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్ 127కే ఆలౌటయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. టాపార్డర్ కుప్పకూలగా.. బ్రూక్ హల్లిడే (69) కెప్టెన్ సోఫీ డెవినె (63) అర్ధ శతకాలతో రాణించారు. దాంతో.. అలవోకగా 230 వరకూ కొట్టేలా కనిపించింది వైట్ ఫెర్న్స్. కానీ, డెత్ ఓవర్లలో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ల వేట కొనసాగించారు. ఆఖర్లో వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ (12), లీ తహుహు(12నాటౌట్) పోరాటంతో న్యూజిలాండ్ గౌరప్రదమైన స్కోర్ చేసింది. మరుఫా అక్తర్ వేసిన 50వ ఓవర్లో గేజ్ సిక్స్, ఫోర్ బాదడంతో కివీస్..నిర్ణీత ఓవర్లలో 227 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రబెయా ఖాన్ మూడు వికెట్లు తీసింది.