Womens T20 World Cup : ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలుపొందినా.. వ్యక్తిగతంగా ఎన్ని రికార్డులు బద్ధలు కొట్టినా సరే ‘వరల్డ్ కప్ విజేత’ అనిపించుకోవాలనేది ప్రతి క్రికెటర్ తాపత్రయం. అందుకనే ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ (World Cup) ట్రోఫీల్లో విజయం కోసం శక్తినంతా ధారపోస్తారు ఆటగాళ్లు. వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరితే చాలు ‘హమ్మయ్యా ఇంక ఒక్క అడుగే.. ప్రపంచ చాంపియన్లం అవుతాం’ అని తెగ సంబురపడిపోతారు. కానీ, ఆఖరి మెట్టుపై తడబడి కప్పు చేజారిందంటే.. ఆటగాళ్ల గుండె పగులుతుంది.
‘ఇన్నాళ్లు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందిపో’ అనే బాధతో వాళ్ల కండ్లు చెమ్మగిల్లుతాయి. ఓటమిని తట్టుకోలేక వాళ్లకు తెలియకుండానే కన్నీళ్లు పొంగుకొస్తాయి. అక్టోబర్ 20, ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం అచ్చం ఇలాంటే దృశ్యాలే కంటపడ్డాయి.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ప్రతిసారి ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. 10 జట్లు పోటీలో ఉన్నా సరే.. ప్రత్యర్థులను వణికిస్తూ ఆరుసార్లు ఆసీస్ చాంపియన్‌గా నిలిచింది. అందుకని మిగతా జట్లు కప్ వేటలో ఫైనల్ చేరినా ప్రతిసారి ఓటమే ఎదురయ్యేది. కానీ, ఈసారి సీన్ మారింది. బలమైన ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా (Sout Africa)సెమీస్‌లోనే ఇంటికి పంపింది. మరోవైపు న్యూజిలాండ్ (Newzealand) సైతం మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు చెక్ పెట్టింది. దాంతో, ఈసారి కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. అయితే.. నిరుడు రన్నరప్ సఫారీ జట్టు కప్ కొడుతుందా?.. తొలి సీజన్, ఆ తర్వాతి ఎడిషన్‌లో ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ విజేతగా నిలుస్తుందా? అనే ఉత్కంఠ అభిమానులను నిదురపోనివ్వలేదనుకోండి.
After two heartbreaks, New Zealand finally become T20 World Cup champions 🏆
🔗 https://t.co/IzyzCxH1Lk | #T20WorldCup pic.twitter.com/4oCRYSn0Wv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
దుబాయ్‌లో ఆదివారం రాత్రి 7 గంటలకు టాస్ పడగానే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ తీసుకుంది. తొలిసారి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న కివీస్ బ్యాటర్లు కసిదీరా కొట్టారు. అంతే.. స్కోర్ బోర్డు 158కి చేరింది. భారీ ఛేదనలో న్యూజిలాండ్ బౌలర్ల జోరుకు చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా అమ్మాయిలకు దుఃఖం ఆగలేదు. నిరుడు ఫైనల్లో ఆస్ట్రేలియా ట్రోఫీ తన్నుకుపోవడంతో ఈసారి కసితో ఆడిన సఫారీ జట్టుకు.. కివీస్ షాకిచ్చింది. 32 పరుగుల తేడాతో జయభేరి మోగించి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా ప్లేయర్లు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే.. ‘మూడో ప్రయత్నంలో ట్రోఫీని పట్టేశాం’ అనే భావోద్వేగంలో న్యూజిలాండ్ జట్టు సంబురాలు చేసుకుంది. వరుసగా రెండోసారి కప్ అందినట్టే అంది.. తమ హృదయాన్ని ముక్కలు చేసినా.. ‘మన రోజు రాకపోతుందా?’ అనే ధైర్యంతో లారా వొల్వార్డ్త్ సహచరులను ఓదార్చింది.
A heartbreaking end to two T20 World Cup finals in the year for South Africa 💔 pic.twitter.com/bo1VDkj9Fy
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
కానీ.. జూన్ 30వ తేదీన పురుషుల జట్టు సైతం గెలుపు వాకిట టీమిండియా ఎత్తులకు చిత్తుకాగా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా అమ్మాయిలు సైతం ఆఖరి మెట్టుపై ఒత్తిడికి లోనూ కప్ వదిలేయడం క్రీడాభిమానులను ఒకింత భాధకు గురి చేస్తోంది. ఆదివారం దుబాయ్ మైదానంలోని సఫారీల కోచింగ్ సిబ్బంది.. అభిమానులు మాకే ఎందుకిలా? అనే సందేహాత్మక ప్రశ్నలతో కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తొలి సీజన్ నుంచి ఊరిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ కొల్లగొట్టింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో కివీస్ పొట్టి కప్‌ను ఒడిసి పట్టి చాంపియన్‌గా అవతరించింది. మొదట ఆల్‌రౌండర్ అమేలియా కేర్(43), సుజీ బేట్స్() చెలరేగడంతో కివీస్ 158 పరుగులు కొట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 159 పరుగుల ఛేదనలో కెప్టెన్ లారా వొల్వార్డ్త్(33), తంజిమ్ బ్రిస్ట్(17)లు ధాటిగా ఆడారు. రన్‌రేటు 7కు తగ్గకుండా ధనాధన్ ఆడారు. దాంతో, సఫారీ జట్టు 6 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 47 పరుగులు పిండుకుంది.
పవర్ ప్లే తర్వాతి ఓవర్లో తంజిమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద గ్రీన్‌కు చిక్కింది. అలా 51 వద్ద సఫారీల తొలి వికెట్ పడింది. అమేలియా కేర్ 10వ ఓవర్లో మొదట లారాను .. ఆఖరి బంతికి డేంజరస్ అనెకె బొస్చ్(9)ను పెవిలియన్ పంపి సఫారీలను ఒత్తిడిలో పడేసింది. ఆ సమయంలో బాధ్యతగా ఆడాల్సిన మరినే కాప్(8), నడినె డిక్లెర్క్(6)లు దంచబోయి వికెట్ పారేసుకున్నారు. అంతే.. 77 పరుగులకే సగం మంది డగౌట్ చేరారు. ఇక.. జట్టును గెలిపించాల్సిన బరువు టెయిలెండ్ల మీద పడింది. కానీ, వరుసగా వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు దక్షిణాఫ్రికాను ఓటమి అంచుల్లోకి నెట్టారు.