Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్‌ను పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు మరింత సమయం కావాలని పోలీసులు ఈ సందర్భంగా కోరారు. దీంతో నవంబర్ 4వ తేదీ వరకు నందిగం సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం సురేశ్‌ను గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు.
2020 డిసెంబర్లో వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ అల్లర్లలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మహిళ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు.