జైత్రయాత్రకు తెర.. రికార్డు ఛేదనలో తడబడ్డ టీమిండియా
ఇదివరకే సిరీస్ గెలిచామనో అలసత్వమో, భారీ లక్ష్యాన్ని ఛేదించగలమన్న అతివిశ్వాసమో గానీ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ తడబడింది. వైట్‌వాష్ లక్ష్యంగా బరిలోకి దిగినా ఆతిథ్య జట్టు మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో టీమిండియాకు షాకిచ్చింది.
- సిరీస్‌లో న్యూజిలాండ్‌కు తొలి విజయం
- బ్రేస్‌వెల్ వీరబాదుడు
- ఫిలిప్స్ మెరుపు శతకం
ఆక్లాండ్ : ఇదివరకే సిరీస్ గెలిచామనో అలసత్వమో, భారీ లక్ష్యాన్ని ఛేదించగలమన్న అతివిశ్వాసమో గానీ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ తడబడింది. వైట్‌వాష్ లక్ష్యంగా బరిలోకి దిగినా ఆతిథ్య జట్టు మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో టీమిండియాకు షాకిచ్చింది. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్.. 87 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌లో అయ్యర్ సేన ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది. కివీస్ నిర్దేశించిన 260 పరుగుల రికార్డు ఛేదనలో మెన్ ఇన్ బ్లూ.. 20 ఓవర్లలో 172/9 వద్దే ఆగిపోయింది. తిలక్ వర్మ (35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35) టాప్ స్కోరర్. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్.. గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) మెరుపు శతకానికి తోడు మైఖెల్ బ్రేస్‌వెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 259/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిలిప్స్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టీ20 ఆదివారం (నవంబర్ 1) జరుగుతుంది. కాగా, 2020 నుంచి గత ఆరేండ్లలో టీ20 ఫార్మాట్లో వరుసగా పది మ్యాచ్‌లు గెలుచుకున్న భారత్‌కు న్యూజిలాండ్ గడ్డపై ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
ఫిలిప్స్ ధమాకా.. బ్రేస్‌వెల్ మెరుపులు
కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిలిప్స్, బ్రేస్వెల్దే ఆట. భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ చెలరేగిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 115 పరుగులు జతచేసి మ్యాచ్‌ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడంలో సఫలీకృతమైంది. తొలి ఓవర్లోనే సీఫర్ట్ (3)ను మయాంక్ ఔట్ చేసినా ఫిన్ అలెన్ (31), డారిల్ మిచెల్ (24) మెరుపులతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ను ధాటిగానే మొదలెట్టింది. మయాంక్ వేసిన మూడో ఓవర్లో మిచెల్ 6, 6, 4, 4 బాదుడుకు గేట్లెత్తినా ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్.. మొదట అలెన్‌తో ఆ తర్వాత బ్రేస్‌వెల్ అండతో భారత బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. బౌండరీతో బాదుడు షురూ చేసిన అతడు ప్రిన్స్ విసిరిన ఆరో ఓవర్లో లాంగాఫ్ మీదుగా సిక్స్‌తో పాటు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు సాధించాడు.
అక్షర్ 8వ ఓవర్లో అలెన్‌ను బోల్తా కొట్టించగా రెండో స్పెల్‌కు వచ్చిన మయాంక్ 11వ ఓవర్లో బెవాన్ జాకబ్స్ (7)ను ఔట్ చేశాడు. కానీ ఇన్నింగ్స్‌లో అసలు అరాచకం ఇప్పుడే మొదలైంది. బ్రేస్‌వెల్ అండతో ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రిన్స్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసిన ఫిలిప్స్ 31 బంతుల్లో అర్ధ శతకానన్ని అందుకున్నాడు. అక్షర్ వేసిన 14వ ఓవర్లో బ్రేస్‌వెల్ 4, 4, 6, 4తో 20 రన్స్ దండుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత ఫిలిప్స్ విధ్వంసాన్ని తారాస్థాయికి చేర్చుతూ.. నితీశ్ కుమార్ రెడ్డి వేసిన 16వ ఓవర్లో నాలుగు భారీ సిక్స్‌లు, ఒక బౌండరీతో 32 రన్స్ పిండుకుని 90ల్లోకి వచ్చాడు. ఆ వెంటనే బ్రేస్‌వెల్.. మయాంక్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు దంచాడు. బ్రేస్‌వెల్‌ను 18వ ఓవర్లో ప్రిన్స్ ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ 19వ ఓవర్లో రెండో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టి తన కెరీర్లో మూడో టీ20 శతకాన్ని 46 బంతుల్లో పూర్తిచేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి చేరడానికి ఫిలిప్స్ 15 బంతులే తీసుకోవడం గమనార్హం.
బాదలేక..
సిరీస్‌లో గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పోరులో భారత బ్యాటింగ్ ప్రదర్శన తేలిపోయింది. రికార్డు ఛేదనలో డఫీ వేసిన మొదటి ఓవర్‌కే సంజూ శాంసన్ (4), ఇషాన్ కిషన్ (0) ఔటవడం అయ్యర్ అండ్ కో.ను దెబ్బతీసింది. కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ టీమిండియాపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఇద్దరూ వెళ్లినా గత మ్యాచ్ హీరో అభిషేక్ (27), కెప్టెన్ శ్రేయాస్ (22) దూకుడుగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకోవడంతో భారత్ పవర్ ప్లేలోనే 61/4తో కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత నితీశ్ (21), అక్షర్ (7)ను శాంట్నర్ ఒకే ఓవర్లో వెనక్కిపంపి పర్యాటక జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు. నమన్ ధీర్ మెరుపులు ఎక్కువసేపు కొనసాగలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ ఆఖరిదాకా క్రీజులో ఉన్నా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు.
అర్ష్‌దీప్ @ 150
ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. శాంట్నర్‌ను ఔట్ చేసిన అతడు.. భారత్ తరఫున టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 103 మ్యాచుల్లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. భారత్ నుంచి అర్ష్‌దీప్ తర్వాత బుమ్రా (126), అక్షర్ (116) తదుపరి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే రషీద్ ఖాన్ (200) అగ్రస్థానంలో ఉండగా అర్ష్దీప్ది పదో స్థానం.
1 టీ20ల్లో భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే (259/7) అత్యధిక స్కోరు. అంతేగాక న్యూజిలాండ్‌కూ ఈ ఫార్మాట్లో ఇదే హయ్యస్ట్ స్కోరు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 259/7 (ఫిలిప్స్ 107, బ్రేస్‌వెల్ 65, మయాంక్ 3/48, అర్ష్‌దీప్ 1/38);
భారత్: 20 ఓవర్లకు 172/9 (తిలక్ 35, నమన్ 28, డఫీ 4/23, శాంట్నర్ 2/24)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

