Kane Williamson | అక్లాండ్: భారత్తో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును బుధవారం ఎంపిక చేశారు. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకుండానే కివీస్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న విలియమ్సన్ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టిమ్ సౌథీ స్థానంలో టామ్ లాథమ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఆల్రౌండర్ మిచెల్ బ్రేస్వెల్ తొలి టెస్టు తర్వాత స్వదేశానికి వెళ్లనుండగా, అతని స్థానాన్ని ఇష్ సోధీ భర్తీ చేయనున్నాడు. ఈ నెల 16 నుంచి బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టుపోరు జరుగనుంది.