న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టీ20, వన్డే సిరీస్‌లకు జట్లను ఎంపికచేసింది.
అయితే, తమ సొంతగడ్డపై జరగనున్న ఈ సిరీస్ నుంచి సీనియర్ ప్లేయర్లు మార్టిన్ గప్టిల్, ట్రెంట్ బౌల్ట్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విశ్రాంతినిచ్చింది. గప్టిల్ స్థానాన్ని ఫిన్ అలెన్ భర్తీ చేయనున్నాడు. ట్రెంట్ బౌల్ట్‌కు స్థానాన్ని భర్తీ చేసేందుకు చాన్నాళ్లుగా జట్టుకు దూరమైన పేస్ బౌలర్ అడమ్ మిల్నేకు అవకాశం కల్పించారు.
ఇదిలావుంటే, భారత జట్టు కూడా సీనియర్ల గైర్హాజరీలో ఈ సిరీస్‌లో పాల్గొంటున్నది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనుండటంతో టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.