Paris Olympics | ఢిల్లీ: విశ్వక్రీడల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి ముగిసిన జావెలిన్ త్రో ఫైనల్లో స్వర్ణం, రజతం సాధించిన అర్షద్ నదీమ్ (పాకిస్థాన్), నీరజ్ చోప్రా (భారత్) మాతృమూర్తులు తమ కొడుకుల ప్రదర్శనపై స్పందించిన తీరు మానవతావాదులను హత్తుకునేలా చేసింది. నీరజ్ తల్లి సరోజ్ దేవి మాట్లాడుతూ.. ‘నీరజ్ రజతం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్లో స్వర్ణం గెలిచిన నదీమ్ సైతం మా కొడుకు వంటి వాడే. వాళ్లంతా క్రీడాకారులు. అందరూ కష్టపడతారు. నదీమ్ చాలా మంచి ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. నీరజ్, నదీమ్ మధ్య పెద్దగా తేడాల్లేవు. మా ఇంట్లోకి పసిడి, వెండి పతకాలు వచ్చాయి. వాటిలో మాకు వ్యత్యాసం ఏమీ లేదు’ అని తెలిపింది.
ఇక అర్షద్ తల్లి రజియా పర్విన్ మాట్లాడుతూ.. ‘నీరజ్ కూడా నా కొడుకుతో సమానం. అతడు నదీమ్ స్నేహితుడే గాక సోదర సమానుడు. ఆటలో గెలుపోటములు సహజం. నీరజ్కూ దేవుడి ఆశీర్వాదం ఉండాలి. అతడు ఇంకా పతకాలు గెలవాలి. నేను నీరజ్కూ పతకం రావాలని దేవుడిని వేడుకున్నా’ అని వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఈ ఇద్దరు అథ్లెట్ల తల్లుల వ్యాఖ్యలు మాత్రం ఎంతో పరిణితితో ఉండటమే గాక రెండు దేశాల ప్రజల మధ్య ఐక్యతను చాటాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రజతం గెలిచిన తర్వాత నీరజ్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. “ఫైనల్ ముగిశాక మీ తల్లి ఇంటర్వ్యూ చూశాను. ‘స్వర్ణం పతకం గెలిచిన వ్యక్తి కూడా నా కొడుకుతో సమానం’ అని ఆమె చెప్పింది. ఆమె వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తికి నిదర్శనం” అని కొనియాడారు.
బరిలో నీరజ్.. బద్దలైన రికార్డులు
భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం అర్ధరాత్రి బరిలో నిలిచిన జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా ఒలింపిక్స్ వెబ్సైట్, యాప్‌నకు నెటిజన్లు పోటెత్తారు. ఈ ఎడిషన్‌లో మొదటిసారిగా వెబ్, యాప్‌ను 273 మిలియన్ల (సుమారు 27.3 కోట్ల మంది) యూజ ర్లు వీక్షించారు. తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధికం. భారత హాకీ జట్టు కాంస్య పతక మ్యాచ్‌తో పాటు రాత్రి 11.55 గంటలకు మొదలైన నీరజ్ చోప్రా ఫైనల్ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత క్రీడాభిమానులు అమితాసక్తి చూపించారని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చెందిన కార్పొరేట్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ కిస్టియన్ క్లా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.