న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా 11 మంది ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులకు ఎంపిక చేసింది. ఖేల్ రత్న అవార్డులను అందుకోనున్న వారిలో నీరజ్ చోప్రాతోపాటు టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన రెజ్లర్ రవి దహియా, కాంస్యం గెలిచిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్, హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రితోపాటు ఐదుగురు పారా అథ్లెట్లు ఉన్నారు.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు పొందిన పారాలింపియన్స్‌లో షూటర్లు అవని లెఖారా, మనీష్ నర్వాల్, జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షట్లర్లు ప్రమోద్ భగత్, క్రిష్ణ నగార్ ఉన్నారు. వీరంతా పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. కాగా, గతంలో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పేరుతో ఉన్న అవార్డు పేరును కేంద్ర సర్కారు ఇటీవల మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్చింది. ఇక భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా మొత్తం 35 మందికి అర్డున అవార్డులను ప్రకటించారు.
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావనా పటేల్, పారా షట్లర్ సుహాస్ యతిరాజ్, హైజంపర్ నిషాద్ కుమార్‌తోపాటు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హాకీ టీమ్ సభ్యులు ఆ అర్జున అవార్డు గెలిచిన వారిలో ఉన్నారు.